పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18


మొదటిది :- అన్యథా,ఆ దౌర్జన్యపరిణామముగా తనకు మరణము కలుగునను భీతిని సహేతుకముగ కలిగించగలుగునట్టి దౌర్జన్యము ;

రెండవది :—అన్యథా, ఆ దౌర్జన్యపరిణామముగా తనకు దారుణ ఘాత కలుగునను భీతిని సహేతుకముగా కలిగించగలుగు దౌర్జన్యము;

మూడవది :—మానభంగముచేయు ఉద్దేశముతో చేసిన దౌర్జన్యము,

నాల్గ వది :-- కామతృష్ణను ప్రకృతి విరుద్ధముగా తీర్చుకొను ఉద్దేశముతో చేసిన దౌర్జన్యము ;

అయిదవది :--- వ్యవహరణ లేక ఆపహరణచేయు ఉద్దేశముతో చేసిన దౌర్జన్యము;

ఆరవది :— ఒక వ్యక్తికి తన విడుదలకై పబ్లికు ప్రాధికారుల సహాయమును పొందజాలనను నట్టి భీతిని సహేతుకముగ కలిగించు పరిస్థితులలో, ఆతనిని ఆక్రమముగా పరిరోధించు ఉద్దేశముతో చేసిన దౌర్జన్యము.

మరణము మినహా ఏదేని కీడు కలిగించుటకు అట్టి హక్కు ఎప్పుడు విస్తరించును.

101. అపరాధము, పై కడపటి పరిచ్ఛేదములో పేర్కొనిన ఆపరాధములలో ఏ రకపుదైనను కానిచో శరీర విషయమున స్వయంరక్షణ హక్కు స్వచ్ఛందముగా దౌర్జన్యపరునికి మరణము కలిగించు మేరకు విస్తరించదు. అయితే, 99వ పరిచ్ఛేదములో పేర్కొనిన నిర్బంధనలకు లోబడి దౌర్జన్యపరునికి మరణము మినహా ఏ కీడునైనను స్వచ్ఛందముగా కలిగించు మేరకు విస్తరించును.

శరీర విషయమున స్వయంరక్షణ హక్కు ఎప్పుడు ప్రారంభమగును, ఎంతవరకు కొనసాగును.

102. ఏ అపరాధము చేయబడనప్పటికినీ ఆ ఆపరాధమును చేయుటకైన ప్రయత్నము వలన లేక చేయుదుమను బెదరింపు వలన శరీరాపాయము కలుగునని సహేతుకమైన భీతి కలిగిన వెంటనే శరీర విషయమున స్వయంరక్షణ హక్కు ప్రారంభమై, శరీరాపాయమును గురించిన భీతి ఉండునంత వరకు కొనసాగును.

ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు మరణము కలిగించు మేరకు ఎప్పుడు విస్తరించును.

103. 99వ పరిచ్ఛేదములో పేర్కొనిన నిర్భంధనలకు లోబడి, ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు ఆ హక్కును వినియోగించుకొను సందర్భము ఏ అపరాధము చేయుట లేక చేయ ప్రయత్నించుట వలన ఏర్పడెనో ఆ ఆపరాధము ఇందు ఇటు పిమ్మట పేర్కొనిన వాటిలో ఏరకమునకైనను చెందినదైన యెడల, దోషకారికి మరణమును లేక, ఏదేని ఇతర కీడును స్వచ్ఛందముగా కలిగించు మేరకు విస్తరించును, అవేవనగా :-

మొదటిది :- దోపిడీ;

రెండవది :- రాత్రిపూట ఇంటికి కన్నము వేయుట;

మూడవది : మనుష్య నివాస స్థానముగా లేక ఆస్తికి ఆభిరక్షక స్థానముగా ఒక భవనమును, డేరాను లేక జలయానమును వాడుచుండగా, ఆ భవనమునకు, డేరాకు లేక జలయానమునకు నిప్పు పెట్టెడు దుశ్చేష్ట ;

నాల్గవది :--అట్టి స్వయం రక్షణ హక్కును వినియోగించుకొననిచో, దాని ఫలితముగా మరణమైనను దారుణమైన ఘాతయైనను కలుగునని సహేతుకముగా భీతిని కలిగించునట్టి పరిస్తితులలో జరిగిన దొంగతనము, దుశ్చేష్ట, లేక ఇంట అక్రమ ప్రవేశము.

మరణము మినహా ఏదేని కీడు కలిగించుటకు అట్టి హక్కు ఎప్పుడు విస్తరించును.

104. ఏ ఆపరాధమును చేయుట లేక చేయ ప్రయత్నించుటవలన స్వయం రక్షణ హక్కును వినియోగించ, సందర్భము ఏర్పడునో ఆ ఆపరాధము, పై కడపటి పరిచ్ఛేదములో పేర్కొనిన వాటిలో ఏ రకమునకైనను చెందనిదైన దొంగతనము, దుశ్చేష్ట , లేక అపరాధిక ఆక్రమ ప్రవేశము అయినచో, ఆ హక్కు స్వచ్ఛందముగా మరణమును కలిగించు మేరకు విస్తరించదు, అయితే 99వ పరిచ్ఛేదములో పేర్కొనిన నిర్బంధనలకు లోబడి, దోషకారికి మరణము మినహా ఏ కీడునైనను స్వచ్ఛందముగా కలిగించు మేరకు విస్తరించును.

ఆస్తి విషయమున స్వయం రక్షణ హక్కు ఎప్పుడు ప్రారంభమగును, ఎంతవరకు కొనసాగును.

105. ఆస్తికి ఆపాయము కలుగునని సహేతుకముగా భీతి ప్రారంభమైనపుడు, ఆ ఆస్తి విషయమున స్వయం రక్షణ హక్కు ప్రారంభమగును.

ఆస్తిని గైకొనిన ఆపరాధి దొరకకుండా పోవునంత వరకుగాని, పబ్లికు ప్రాధికారుల సహాయము లభించువరకు గాని, ఆస్తి తిరిగి దొరికేవరకుగాని, దొంగతనమును అడ్డుటలో ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు కొనసాగును.