పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరింగంటి వంశకవులు నల్లగొండమండలకవులలో అధికలబ్ధప్రతిష్ఠులు. వారియందు సింగరాచార్యులు ఆద్యుడు, మిన్నయైనవాడు. సింగరాచార్యులను గూర్చి తెలుసుకొనుటకు ముందు ఇతనికి పూర్వాపరములగల ఆవంశపుకవులను గూర్చి తెలిసికొందము.

2. మరింగంటి కవులు - రచనలు :

తరతరములుగా గీర్వాణాంధ్రభాషాకవివతంసులని పేరెన్నికగన్న యీవంశపుకవులకు నల్లగొండ మండల మాకరమైనది. అందు ముఖ్యముగా నేటిదేవరకొండ తాలూకాలోని 'కనగల్లు' గ్రామము. ఇచ్చటనుండి కొంతకాలము తర్వాత వీరిలో కొందరు ఇతరప్రాంతములయందు స్థిరపడినారు. మిర్యాలగూడెం తాలూకాలోని 'అనుముల’ హుజూర్ నగర్ తాలూకాలోని 'యాదవాకిళ్ల' జనగాం తాలూకాలోని 'మల్లంపల్లి' మరియు సూర్యాపేట, విశాఖపట్నము జిల్లాయందలి భీమునిపట్నము, కృష్ణామండలములోని మొఖాసాకలువపూడియందును గలరు.

వీరియింటిపేరు ఆసూరి మరింగంటివారు. ఈ పేరు (ఆసూరి) చాలావిశిష్టమైనది. ఎందుకనగా శ్రీమద్రామానుజుల వారిగృహనామమును ఆసూరి వారే! ఇక 'మరింగంటి' అని వీరికి గృహనామము కలుగుటకు గలకారణములను వీరు తమ రచనలయందు చమత్కారముగా నిట్లు తెల్పినారు. 'శేషాంశసంభవుడైన లక్ష్మణార్యుడు పండ్రెండువేలమంది త్రిదండసన్యాసులు, ఏడువేలజనము, డెబ్బదినాల్గువేల గురుజనము, లక్ష తిరునామధారులు వెంటరాగా శ్రీవైష్ణవమతస్థాపనార్థమై బయలుదేరి అనుకూలుర ననుగ్రహించి చెనటులను శిక్షించి అష్టదిశలయందు శ్రీమతమును నిల్పి శ్రీరంగమునకు తిరిగి రాగా లక్ష్మణాచార్యులతో శ్రీరంగేశుడు.

కంటిన్ లక్ష్మణమునివరుఁ
గంటిన్ గూరేశ దేశికస్వామిమ ఱిం
గంటి నదెవ్వరన 'మఱిం
గంటి' మహాన్వయము దనరె గణ్యం బగుచున్.

(ద. రా. నం. చ. 1–15,16)