పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేద్యు'లైన కవిపండితుల కాశ్రయ మొసంగి సాహితీసారశీకరాసారముల కల్గించినవి.[1]

తెలంగాణ జిల్లాలలో నొకటైన నల్లగొండ చారిత్రకముగనేగాక సాహిత్యసాంస్కృతికముగను పేరెన్నిక గనినది. గో. క. సం లో ఆయాజిల్లాల కవుల సంఖ్య నొసంగిరి అందు నల్లగొండ కవుల సంఖ్య 57 మాత్రమే గలదు. ఏకారణము వలననో గాని అప్పటికే యిందు చేరవలసిన కవులు చేరలేదు. వదిలిపెట్టబడిన కవులే యీజిల్లాలో సుమారు 60 మంది గలరు, వీరిలో కొందరినిగూర్చి లభించిన యాధారములతో 'భారతి', 'ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రిక'లద్వార నేను తెలుపుచున్నాను. కాని గ్రంథములు దొరకనికవులు, కవి పేరు తెలియని రచనలు కొన్ని గలవు. ఆయాకవివంశీయుల అశ్రద్ధవల్ల పాడైన గ్రంథములును హెచ్చుగా గలవు. మరికొన్నిగ్రంథములు మదరాసు కాకినాడలయందలి ప్రాచ్యపుస్తకభాండాగారములయం దముద్రితముగా వాసము చేయుచున్నవి, ఉదా:-1,400 ప్రాంతమున రాచకొండ సంస్థానమునం దున్న బొమ్మకంటివారి హరుడను కవి మురారికృత అనర్ఘరాఘవమునకు వ్యాఖ్య వ్రాసెను. ఈప్రతి మదరాసు ఓరియంటల్ లైబ్రరీలో గలదని గో.క. సం. (22పుట) తెలుపుచున్నది. ఈవిధముగనే మరికొన్నిరచనలు గలవు. కవిత్రయముతర్వాత యథామూలముగా భారతము నాంధ్రీకరించిన చిఱుమర్రి నరసింహకవి మిర్యాలగూడెం తాలూకా కంపాలపల్లి నివాసి. ఈయన భారతమును భువనగిరిలో నొకవైశ్యునకు అంకిత మిచ్చినాడట. నేటివర కది యలభ్యముగా నున్నది.[2] ఈ విధముగా నల్లగొండమండల కవులు రచనలు వికీర్ణములుగా నున్నవి.

  1. వివరములకు – "తెలంగాణములోని సంస్థానములు - సాహిత్యపోషణ' కేశవపంతుల నరసింహశాస్త్రిగారి వ్యాసము. (విజ్ఞానసర్వస్వము. 4. భా. విశ్వసాహితి పుటలు 1175-79) మహబూబ్ నగర సంస్థానముల గూర్చి మాత్రమే గలదు. ఇటీవల డా. తూమాటి దొణప్పగారు ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణగురించి ప్రత్యేకగ్రంథము వెలువరించిరి.
  2. చిరుమర్రి నరిసింహకవి - "లక్షణనవరత్నమాలిక"(భారతి 1966 మార్చి) లక్షణనవరత్నమాలిక యను ఛందోగ్రంథ మిందు ప్రచురించనైనది. కవిని తత్కృతులను గూర్చియును గలదు. (శ్రీ)