పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నివాసము:

శతఘంటావధాన, శారదాప్రశ్నవివరణ, ఆశుకవి యిత్యాది అన్వర్థబిరుదాభిరాముడగు సింగరాచార్యులు, వరదమాంబా తిరువేంగళాచార్యుల గర్భశుక్తిముక్తాఫలము. శ్రీవైష్ణవులు. మౌద్గల్యగోత్రము. మరింగంటివారికి పుట్టిల్లైన కనగల్లులో సింగరాచార్యుల పూర్వు లుండెడివారట. కొంతకాలము తరువాత, నేటి మిర్యాలగూడెం తాలూకా యందలి వాడపల్లిలో నరసింహస్వామి యాలయమున వీరు స్థానాచార్యత్వము వహించియున్నట్లు గోదావధూటీపరిణయములో గలదు.

మ.

"నరనాగాశ్వనృపాలశేఖరులు నానారత్నభూషావళుల్
తురగాందోళికఛత్రచామరతతుల్ తోరంబుగా నీయగన్,
సిరు లింపొందుచు వాడపల్లి నగరిన్ చెన్నొందుచున్నట్టి శ్రీ
నరకంఠీరవు కోవెలస్థలికి స్థానాచార్యులై యుండఁగాన్.”

(1-37)

దీని తరువాతగల-

సీ.

అమ్మహీమండలి కాఢ్యులౌ పరివృఢుల్
హర్హత తమనటు నాశ్రయించు
వేళను యాదవాకిళ్లను గ్రామంబు
నగ్రహారంబుగా నటనొసంగ
నతివేడ్క వారలు నాలయంబుగ నిల్చి
యధికసంపన్నత నలరుచుండు.....

(1-38)

ఇత్యాది పద్యము వలన వాడపల్లి నుండి వీరు యాదవాకిళ్ల యను (అగ్రహారము) గ్రామమునకు వెళ్లినట్లు గలదు. ఈ గ్రామము హుజూర్ నగరం తాలూకాలో నున్నది. మరింగంటివా రిప్పటికీ ప్రాంతములయం దున్నట్లు గతప్రకరణమున తెలుసుకున్నాము.

కనగల్లు నేడు దేవరకొండ తాలూకాలో గలదు. వాడపల్లియు నట్లే యుండెడిది. కాని జిల్లాల విభజన జరిగినపు డీవాడపల్లి మిర్యాలగూడెం తాలూకాలో చేరినది. కనగల్లు వాడపల్లి సమీపములుగా నుండును.