పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశరథరాజనందనచరిత్రయు - నిరోష్ఠ్యసీతాకల్యాణమును - సింగరాచార్యులు కర్పరాద్రినరసింహస్వామి పేర నంకితమొసంగినాడు. దేవరకొండతాలూకాలో - పణ్కరాజుపల్లి యనుగ్రామము గలదు. అది అడవిదేవులపల్లి యనుగ్రామమునకు సమీపముగా నుండును. పణ్కరాజుపల్లి వద్ద గుట్ట గలదు. అందు నరసింహస్వామి యాలయమున్నది. ఆ పర్వతమునే సంస్కృతీకరించి కర్పరాచలమని కవి చెప్పుకొని యున్నాడు. అంతేగాక 'కర్పర' యను గ్రామమొకటియు ఈ పల్లెవద్దగల యొకచిన్నపల్లె. దీనివలననైనా కవి కర్పరాద్రి యనవచ్చును— '.... దేవరకొండ సీమలో సన్నుతపణ్కరాజువలిశైలమునన్ ....' (1-20) అని యీగ్రంథములో చెప్పబడిన దీకర్పరాచలమే!

శు. ని. నీ. కల్యాణమందు సింగరాచార్యులు తమతండ్రియైన తిరువేంగళనాథుడు గురురాయపట్టణస్థాపకుడై చెలంగిన హరితీర్థములు కొన్నిటిని పేర్కొన్నాడు—(1-50)(పద్యము-అనుబంధములో) ఆ గ్రామములు నేడేయే తాలూకాలలో గలవో తెల్పుదును—

1 అనంతగిరి- 1. దేవరకొండకు సమీపమున అనగా-దేవరకొండ నుండి కల్వకుర్తికి వచ్చు మార్గమునందు గలదు.

2. బిజినేపల్లి యను గ్రామము నాగరకర్నూలు తాలూకాయందు గలదు, దానికి పూర్వము అనంతగిరి యని పేరున్నట్లు తెలియుచున్నది.

2 ధర్మపురి- సుప్రసిద్ధమైన నరసింహ క్షేత్రము-కరీంనగర్ జిల్లాలో గలదు.

3 ఊరుగొండ- 1. 'ఉర్లుగొండ' యని-రామన్నపేట తాలూకాలో నొకటి గలదు.

2. మహబూబ్‌నగరం జిల్లాలోని జడ్ చర్ల - కల్వకుర్తిలో 'ఊరుగొండ పేట గలదు.
3. దేవరకొండ తాలూకాలో నొక యూరుగొండ గలదట.