పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైన శతఘంటకవనధురీణులు గలరు గదా! 1550-'80 వరకు మల్కిభరాం పరిపాలనాకాలము. ఈమధ్యకాలమున విజయనగరరాజుల యాస్థానములో జగన్నాథాచార్యులు కనకాభిషేకము పొందియుండవచ్చునని యూహించుట కవకాశము గలదు. ఈజగన్నాథసూరి యనుజుడే మన సింగరాచార్యులు. ఈయనను గూర్చి ముందు తెలుపుదును. సింగరాచార్యుల తరువాత గల కవులను గూర్చి తెలుసుకొందము.

4. వేంకటనరసింహాచార్యులు:- ఈకవి సింగరాచార్యులకు ఆరవతరములో ఈ కోవలోనే సుమారు 1770 ప్రాంతమున నున్నవాడు. ఈపేరుగలవా రీవంగడమున నింక కొందరు గలరు కావున ప్రథమవెంకటనరసింహాచార్యులుగా నీతనిని పరిగణింపవచ్చును. మహాకవియైన యితడు రంగాంబావెంకటార్యుల పుత్రుడు. "షోడశమహాగ్రంథబంధురాలంకారనిర్మాణపారీణఘనయశోబంధురుడు" (గోదా-) ఇతనివి కొన్నిరచనలు మాత్రము లభ్యమైనవి. కనగల్లు నందలి తాళపత్రగ్రంథనిలయములో నేతత్కవివంశీయులైన శ్రీరంగాచార్యులవారు వీనిని బదిలపరచి యుంచెడివారు. గోదావధూటీపరిణయము దక్క తక్కిన వన్నియు నముద్రితములు.

రచనలు :-

  • 1. విదేహరాజకన్యకాభ్యుదయము.
  • 2. శ్రీకృష్ణశతానందీయము.
  • 3. చిలువపడిగఱేనిపేరణము.
  • 4. నృకంఠీరవాభ్యుదయము.
  • 5. క్షత్రబంధోపాఖ్యానము.
  • 6. జాంబవతీకుమారశృంగారవిలాసము.
  • 7. రామానుజాభ్యుదయము.
  • 8. శల్వపిళ్లరాయచరిత్ర.
  • 9. విష్వక్సేనప్రభాకరము.
  • 10. గోదావధూటీపరిణయము.
  • 11. పద్మినీకన్యకాభ్యుదయము.
  • 12. రతిమన్మథాభ్యుదయము.
  • 13. మిత్రవిందోపాఖ్యానము.