పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీనియందు గోదావధూటీపరిణయము 1956 లో ఆ. మ. శ్రీరంగాచార్యులవారి సంపాదకత్వమున నల్లగొండ (రామగిరి) మహిళాభక్తసమాజమువారు ప్రచురించినారు, ఇది మూడాశ్వాసముల ప్రబంధము. గద్యపద్యములు సుమారు 300. కవిత్వమంత ప్రౌఢముగా లేకున్నను మంచిగానున్నది. గోదాదేవి యనగా ఆండాళు, ఆమె చరిత్ర దీనిలో ముఖ్యము. పరిష్కర్తలైన సంపాదకుల యశ్రద్ధ వల్లనేమో, దోషములు హెచ్చుగా నున్నవి. దానికితోడు ముద్రారాక్షసులు. దేవరకొండ తాలూకాయందలి 'శిరిసనగండ్ల' నరసింహస్వామి కీకృతి యంకితము. పూర్వులనుండి ఈ కవివరకు గల మరింగంటివారిని గూర్చి కృత్యాదిలో తెలిపినాడు. సింగరాచార్యుల తర్వాత గల మరింగంటి వారిని గూర్చి తెలుసుకొనుట కీగ్రంథకృత్యాది మిక్కిలిగా నుపకరించును.

శ్రీకృష్ణశతానందీయము :

ఇది ఎన్నియాశ్వాసములో తెలియదు. లక్ష్మణరాయపరిశోధకమండలిలోనున్నట్లు పరిశోధకులు తెల్పిన గ్రంథములలో నిది యొకటి. పింగళిసూరన కళాపూర్ణోదయమునందు మాయానలకూబరుని గల్పించినట్లు మాయాబ్రహ్మను కల్పించి, కొంత హాస్యమును చిలికింపచేసినాడు. బ్రహ్మ శ్రీకృష్ణుని గోవు లపహరించగా శ్రీకృష్ణుడు బ్రహ్మ వేషమున సరస్వతివద్దకు వెళ్లి మంతనము లాడుచుండును. ఆ సమయమున అసలు బ్రహ్మ వచ్చును. ఇరువురు బ్రహ్మల జూచి సరస్వతియు ఇతరులును తబ్బిబ్బగుదురు. చాల చక్కనిశైలిలో నున్న రచన. అముద్రితముగానున్న మంచిరచనలలో నిదియొకటి.

చిలువపడిగఱేనిపేరణము :

ఇది యచ్చతెనుగుకావ్యము. చిలువపడిగఱేడు = దుర్యోధనుడు (సర్పధ్వజుడు). ఇతని వివాహకథ యిం దభివర్ణితము. కొందరు భావించినట్టు కలువపడగఱేనిపేరణము సింగరాచార్యులరచన గాదు. శ్రీకృష్ణశతానందీయమును ఈగ్రంథమును గూర్చియు పండిత ఆదిరాజు వీరభద్రరావుగారు సంక్షిప్తపరిచయము చేసినారు[1]. ఈ వెంకటనరసింహాచార్యుల తరువాత తెలియవచ్చు

  1. “మనతెలంగాణము" - పుటలు 24, 25 (1969) మరియు ఆచార్య ఖండవల్లి లక్షీరంజనంగారు - "ఆంధ్రసాహిత్యచరిత్రసంగ్రహము" 193, 194 పుటలలో పైరెండుగ్రంథములగూర్చి వ్రాసినారు. (1965)