పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లచే అభినుతుల్ గాంచిన వాడు' ('గోదా' తెలుపుచున్నది). ఇట్టిప్రతిభావంతుడు గావుననే తెలగన్న గ్రంథమును తురుష్కాధికారికి అంకిత మిప్పించు ప్రయత్నము విఫలము గాలేదు.

అప్పలాచార్యులను గూర్చి ఈ విషయములు తెలిసినవి. కాని రచన యొక్కటియు లక్ష్యముగా లేదు. ఈయనకు సోదరులు సప్తసంఖ్యగా గలరు. అందు అయిదవ వ్యక్తి -

3 జగన్నాథాచార్యులు: ద. రా. నం.చ లో సింగరాచార్యు లీయనను జగన్నాథసూరిగా తెల్పినాడు. ఈయనకును అప్పలాచార్యులవలెనే రచనలు లేని పరిచయము. జగన్నాథాచార్యులు 'సరసశతపద్యలేఖినీవిరచనారక్తి' గలవాడు. 'వినుతశతఘంటబిరుదాంకవిజయుడు' 'అవధానచక్రవర్తి' ఇంతేగాక కనకాభిషేక మందినవాడనియు శతావధానియనియు బహుసంస్కృతాంధ్రరచనాదక్షుడుగను, నేబతి కృష్ణమంత్రి' తన రాజనీతిరత్నాకరములో నిట్లు స్తుతించినాడు -

"గురుమూర్థన్యు శతావధానబిరుదాంకున్ ద్రావిడామ్నాయత
త్వరసజ్ఞున్, పటుసంస్కృతాంధ్రరచనాదక్షున్ హయాధీశకం
ధరసంలబ్ధసువర్ణవృష్టియుతుకర్ణాటక్షమాభృత్సభాం
తరపూజ్యున్ మరుకంటి వేంగళజగన్నాథార్యు గీర్తించెదన్."[1]

(1-3)

అప్పలాచార్యులు నవాబుల ఆస్థానమున విశేషగౌరవాదరముతో నున్నాడు గదా! జగన్నాథాచార్యులును నిచ్చట గౌరవము పొందెనో లేదో? గాని 'కర్నాటక్షమాభృత్సభాంతరపూజ్యుడు' మాత్ర మైనాడు. అప్పటికి తల్లికోటయుద్ధము (23-1-1565) జరుగక పూర్వమైన నళియరామరాయలవద్దనో, ఇంక కొద్ది ముందుకు పోయినచో శ్రీరంగరాయల (1574-'85) ఆస్థానములోనో, జగన్నాథాచార్యులు పైమన్ననలు పొందియుండవచ్చును. శ్రీరంగరాయలకన్న అళియరామరాయల ఆస్థానముననే ఈయనకు సన్మానము జరిగి యుండవచ్చును. కారణమేమనగా రామరాజభూషణుడు మొద

  1. కుతుబ్షాహీ సుల్తానులు - ఆంధ్రసంస్కృతి అను గ్రంథము (1962)న సంపాదకులు డా॥ బి. రామరాజుగారు నేబతి కృష్ణయామాత్యుని గూర్చి వ్రాసినవ్యాసములో నుదాహరించిన పద్యము (పుట 99).