పుట:దశకుమారచరిత్రము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

సూర్యోదయాదివర్ణనములు తరువాతికవులకుఁ జాలవఱ కాదర్శము లయ్యె ననుటలో సాహసము లేదు. కేతన కభినవదండి బిరుదము దశకుమారచరిత్ర రచనానంతరము పండితు లొసంగిన దనుట కాధారములు గలవు. ఆంధ్రభాషాభూషణమున కేతన

“క. వివిధకళానిపుణుఁడ నభి, నవదండి యనంగ బుధజనంబులచేతన్
     భువి పేరు గొనినవాఁడను."

అని వ్రాసికొనియున్నాఁడు. కానీ దశకుమారచరిత్రములోఁగూడ గద్యయందు అభినవదండి యనుకొనుట యెటుల నొప్పును. గ్రంథరచనానంతరము వచ్చినబిరుదము గ్రంథమున నెటులఁ జేర్పఁబడె నని కొంద ఱందురు. కృతిశ్రవణానంతరము పండితు లొసంగిన బిరుదమును గద్యమునందుఁ జేర్చికొనియుండు నని మాకుఁ దోఁచుచున్నది.

దశకుమారచరిత్రము సంస్కృతమున వ్రాసినది మహాకవి దండి. ఇతఁడు క్రీ. శ. ఏడవశతాబ్దము పూర్వార్ధమునం దుండెను. ఆకాలపుటాచారములగు పడవ నడుపుటలు సముద్రయానము అనులోమవిలోమద్విజవివాహములు, సంకరబ్రాహ్మణులను గూర్చిన విశేషాంశము లిందుఁ గలవు. చరిత్ర స్థలము లగు కాళేశ్వరము రామతీర్థము కళింగనగరము ఆంధ్రనగరము ఇందుఁ బేర్కొనఁబడినవి. కళింగనగరము సముద్రతీరమందలి సుప్రసిద్ధమగు రేవుపట్టణము. ఇది యొకానొకకాలమున రాజధానిగ నుండెను. ఇందె పేర్కొనఁబడిన యాంధ్రనగరము వేంగి కావచ్చును. జయసింహుఁడు ఆంధ్రదేశమును బాలించిన చాళుక్యరాజన్యుఁ డనియు నితఁడు క్రీ.శ. 633 మొదలు 663 వఱకు రాజ్యము నేలినవాఁడై యుండు ననియు మాతలంపు.