పుట:దశకుమారచరిత్రము.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

331

వ. ఉన్న యెడం గామపాలప్రహారవర్మాదులు సుమతిసచివులకు
     యథార్హప్రతిపత్తి యాచరించినం బదంపడి విదగ్ధసఖీ
     జనంబులు పొదివి తో డ్తేర లజ్జావనతవదన యగుచు
     నవంతిసుందరి యల్లన నరుగుదెంచి యభివందనంబు సేసిన
     నాశీర్వాదపురస్సరంబుగా నాముగ్గురుజనంబులు పత్నీ
     సహితంబుగా మునిప్రవరుల నెల్లను రావించి వారు
     నుం దామును నాదంపతులతోడం గుమారవర్గంబునకు
     సేసలు పెట్టిన యనంతరంబ వామదేవుండు రాజహంసాను
     మతంబున వసుమతీదేవికోడలి నభ్యంతరపర్ణశాలాంగణం
     బునకు సగౌరవంబుగాఁ దోడ్కొని యరిగి యమ్ముద్దియం
     జూపి యమ్మునీంద్రునకు నన్నరేంద్రుం డి ట్లనియె.88
ఆ. ఎసక మెసఁగుకరుణ కెపుడును నునికిప
     ట్టనఁగఁ జాలుమీకటాక్షమహిమ
     మాళవేంద్రుఁ గొన్న మహనీయలక్ష్మి సా
     కారలీలఁ దెచ్చె గ్రమ్మఱంగ.89
వ. అనిన విని యతండు గారవంబున ని ట్లనియె.90
క. ఆవసుదేవునిపిమ్మట
     నీ వొకఁడవు సకలమేదినీతలమున సం
     భావనయోగ్యుఁడ వనుచున్
     దీవన లిచ్చెన్ దయార్ద్రదృష్టిం గనుచున్.91
వ. అంతట సకలసైన్యసమేతుం డై స్వజనులతోఁ గుసుమపుర
     మునకుం జని రాజవాహనునకు మగధరాజ్యపట్టాభిషేకంబు
     చేసి లోకంబులు మెచ్చ ననేకంబులగు దానధర్మంబు లాచ
     రించుచు నిర్భరుం డై రాజహంసుం డుండె నంత.92