పుట:దశకుమారచరిత్రము.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

దశకుమారచరిత్రము

     యయ్యెడ నిగూఢంబుగ నుండునంత నంధకారంబు సాం
     ద్రం బగుటయు మంత్రసాధనోద్యుక్తుండ నైన వెనుకం బతి
     కడకుం జని మేలంపునగవుతో నేకాంతంబున ని ట్లనుము.125
క. నిను నే రూపసి గా వే
     ల్చిన నాసవతులకు నీవు చెలువము మెఱయం
     గనుఁగొనవలసెం గావున
     విను నా క్రిది గనఁగ సామివేలిమి యయ్యెన్.126
క. అనిన విని యాతఁ డపు డే
     మని పలికిన వచ్చి చెప్పు మంతయు నట యే
     నిను మెచ్చించెద నూఱడు
     మని యామదిరాక్షిఁ బుచ్చి యరిగితి నధిపా!127
చ. వనరుహనేత్రయున్ వికటవర్ముని నెంతయు మోసపుచ్చి నా
     పనిచినయట్ల సేసి జనపాలుఁడు నంతటిలోనివాఁడ కా
     వునఁ బరితుష్టుఁ డై యిది యవుం గడు వేగమె దీనిచేఁత మే
     లని యొనరింపఁబూనెఁ బతి యప్పలు కెల్లెడ మ్రోసె నత్తరిన్.128
ఉ. అంతిపురంబులోపల నృపాగ్రణి దేవుల మంత్రశక్తి న
     త్యంతసురూపవంతుఁ డగు నట్టె తలంపఁగ నెందునుత్సవం
     బింతకు మిక్కిలిం గలదె? యేమిటఁ జూచిన నెగ్గు లేదు ని
     శ్చింతమునం దొడంగి [1]యఱసేయక చేయుట చిత్ర మెమ్మెయిన్.129
క. అనియెడువారును నిది వో
     లునొకో యనువారు మందులున్ మంత్రములున్
     వినుతమణిజాలములుఁ జే
     యని యాశ్చర్యములు గలవె యనువారలు నై.130

  1. యెడ