పుట:దశకుమారచరిత్రము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

205

ఉ. అంబరచందనాగురుఘృతాదులు విప్రహుతోజ్జ్వలాగ్నికుం
     డంబున నేకతంబునఁ బటస్థితరూపముమీఁద నీశుమం
     త్రంబున వేల్పు వేల్చి మఱి తద్రుచిరాకృతి దాల్పు తాల్చి నా
     దం బెసఁగంగ ఘంటిక కదల్పు కదల్చిన దానిసన్నకున్.120
క. చనుదెంచి మేదినీపతి
     మును మంత్రులతో రహస్యమున నాలోచిం
     చిన కార్యజాల మంతయు
     వినిపింపఁగవలయు నీకు విస్రంభమునన్.121
క. వినిపించి పిదప సాష్టాం
     గనమస్కృతిపూర్వకంబుగా నగ్నికి న
     ర్చన లిచ్చి నీదుకౌఁగిలి
     గని యతఁ డారూపు దాల్చుఁ గమనీయముగన్.122
ఆ. అంత నీవు తొంటియారూపు దాల్తు మృ
     గాక్షి! దీన సందియంబు లేదు
     మనుజపతికి నీకు మది కియ్యకో లైనఁ
     జేయు మనియె నర్థి జీవితేశ!123
క. నీకును మంత్రులకును నీ
     లోకమువారలకు నాత్మలో నిశ్చిత మై
     కైకోలు గలిగెనే మన
     మీ కార్యము చేయు టురవ యెడ గాకుండున్.124
వ. అనిన వాడును దీని కొడంబడు నీమాధవీమండపప్రదేశం
     బున హెూమకుండంబు నిర్వర్తించునట్లు గావించి సం
     ధ్యాసమయంబున మంత్రజ్ఞుం డైన బ్రాహ్మణుండు పశువిధి
     సేయించి వేల్పించిన యనంతరంబ యేను సొత్తెంచి