పుట:దశకుమారచరిత్రము.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

దశకుమారచరిత్రము

ఉ. కావున నన్నుఁ దోడ్కొనియ కాని చనం దగ దంచు బాష్పసం
     ప్లావితనేత్ర యైనఁ గని పల్కితిఁ గోమలి! యెవ్వఁడైన ల
     క్ష్మీవనితాసమాగమము సేకొన నొల్లక బుద్ధిహీనుఁడై పో
     వఁగఁ ద్రోచునే! యడలు పోవిడు మే నొకమాట చెప్పెదన్.116
వ. అనినం జిత్తంబు నుత్తలంబు దక్క వికసితవదనయు మదీయ
     భాషణాకర్ణసజనితకుతూహలయు నై యున్న యన్నెలం
     తకు ని ట్లంటి.117
సీ. నారూపమున నభినవమైన యాచిత్ర
                    పట మేకతమున నీపతికిఁ జూపి
     యీచిత్రరూపంబు నెనయగు మగరూపు
                    గానంగఁ గలదె యెందైనఁ జూపు
     నాకు నా నతఁ డిట్టి నరు లెట్లు గలుగుదు
                    రెందును? నన్న నీ విట్టు లనుము
     జననీసమానత మనయింటి కొకవృద్ధ
                    తాపసవృత్తి నిత్యంబు వచ్చు
తే. నధిప! యాయవ్వ నేఁడు దయారసైక
     చిత్త యై యొక్కమంత్రంబు చెప్పి పటము
     నిచ్చి తత్సాధనక్రమ మెల్ల నాకు
     నేర్పరించి యేకతమున నిట్టు లనియె.118
తే. వనజలోచన! చెప్పెద వినుము మంత్ర
     సిద్ధి గావించు శ్రమ మెల్ల బుద్ధి సేసి
     నృపతి యనుమతి నమవస నుపనసించి
     పావనస్నానశుద్ధ వై నీవు వచ్చి.119