పుట:దశకుమారచరిత్రము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

175

     చని రాజమార్గంబునం దలవరుల నెదురం గని యొండు
     తెఱంగున మొరంగి పోవమికి విచారించి మరులుఁదనం
     బెక్కించికొనియెద నని దాని కెఱింగించి.156
సీ. చే సంకు వట్టుచుఁ జిడుపలు వెదకుచు
                    నొరిగాల దేవుచు నులికిపడుచు
     విందులు విందులు విందు లంచును బఱ
                    తెంచి మ్రాఁకులు గౌఁగిలించుకొనుచు
     మునుకుచు వెలుఁగుతో ముచ్చట లాడుచుఁ
                    బొరిపొరిఁ గూయుచు బొబ్బ లిడుచుఁ
     గలమాట లాడుచు మొలపుండ్లమల్లనిఁ
                    బాడుచు నొడ లెల్ల బరికికొనుచు
తే. నేవముగ ఱొమ్ముపై నిండఁ ద్రేవు డొలుక
     నన్న! కుడుములు దినవన్న! యనుచు డాసి
     గుండ్రగ్రుడ్లను జూపుచు గునిసిగునిసి
     బయలు నవ్వుచు బడుకిళ్ళు వాచికొనుచు.157
క. చనుట గనుఁగొని సృగాలిక
     యనుమానము లేక వెనుక నతిరభసమునం
     జనుదెంచి యారెకుల కి
     ట్లనియెను శోకంబు గదిరినదియును బోలెన్.158
ఉ. పెక్కుదినంబు లేనిఁ జెఱఁ బెట్టితి నిప్పుడు వీనిమాటలం
     జక్కన వెఱ్ఱి దీఱె నని సంకిల పుచ్చిన పాపజాతి నే
     నెక్కడ సొచ్చుదాన మరు లెత్తి తనూజుఁడు పాఱుచున్నవాఁ
     డక్కట! వానిఁ బట్టుకొనుఁడన్న కృపాపరులార! మ్రొక్కెదన్.159