పుట:దశకుమారచరిత్రము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

దశకుమారచరిత్రము

     రగణితశౌర్య లిద్ద ఱని యాదటఁ జెప్పఁగ వించు వేడుకన్.118
ఉ. అందఱుఁ గూడఁ బూఱి కడు నచ్చెరు వెట్టి మహాతులొక్కొ? వీ
     రిం దగఁ గానఁగావలయుఁ బ్రీతి మెయిన్ వెస నిప్డ వింత మై
     గ్రందుగఁ బోక యొప్పదని గ్రక్కున నొక్కని బుద్ధిమంతుఁగా
     ముందర బారిచుట్టకముం గొనియాడఁగఁ బంచి రర్ధితోన్.119
వ. తదనంతరంబ తొల్లి రాజవాహను నన్వేషింపం జని పుణ్య
     వశంబున నొక్కొక్కదేశంబున కధిపతు లై యుండి చం
     పాపురీశ్వరునకు సహాయ మనుష్ఠింపం దమసైన్యంబులతో
     జనుదెంచిన యపహారవర్మయు నర్ధపాలుండును బ్రమతియు
     మిత్రగుప్తుండును మంత్రగుప్తుండును విశ్రుతుండును నొం
     డొరుం గనుంగొని గాఢోపగూఢసౌఖ్యం బనుభవించు నెడ
     నర్ధపాలుండు నపహారవర్మయు నిజజనకులైన కామపాలునిం
     బ్రహారవర్మునిం జెలులకుం జెప్పిన నయ్యిరువురకు నందఱు
     నుచితాలాపంబులఁ బ్రియంబు సేయు సమయంబున ముంద
     టం బోయిన దూత రాజవాహను ననుమతి రాజలోకంబు
     నతనిపాలికిం బిలువ వచ్చిన సమస్తమహేశ్వరులుం బోవఁ
     గదలుటయుఁ గుమారులు విధియత్నంబున లోకోత్తరచ
     రిత్రులగు నయ్యిరువురు మనవార యగుటకు దైవయో
     గంబు గలుగునో యని యన్యోన్యకుశలవార్తాశ్రవణకుతూ
     హలంబు శోభిల్ల వీరపురుషదర్శనోత్సుకు లగుచు నతిత్వరి
     తంబున నరిగి వారలం జూచి రాజవాహనుండును నపహార
     వర్మయుఁగా నెఱింగి.120