పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

371


బలహీనంగా వున్నది అని అంటే వారిలో సత్యాగ్రహుల సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పక తప్పదు. దక్షిణాఫ్రికా యందలి భారతీయుల్ని వేలెత్తి తప్పు పట్టడానికి నేను యిలా వ్రాయడం లేదు. అక్కడి వాస్తవ పరిస్థితిని మాత్రమే సూచిస్తున్నాను. వ్యక్తికానీయండి, లేక వ్యక్తుల సముదాయం కానీయండి, తమలో లేని గుణాల్ని బైటినుంచి ఎలా తెచ్చుకోగలుగుతారు? అక్కడి అనేక మంది సత్యాగ్రహ సేవకులు ఒకరి తరువాత ఒకరు దేవుని సన్నిధికి వెళ్లి పోయారు. సొరాబ్జీ, కాఛలియా, తంబినాయుడు, పారసీరుస్తుంజీ మొదలైన వారంతా కన్ను మూశారు. అక్కడ తక్కువ మంది సత్యాగ్రహులు మాత్రమే మిగిలారు. బ్రతికి యున్న సత్యాగ్రహులు యీనాటికి అక్కడి ప్రభుత్వంతో పోరాటం సాగిస్తున్నారు. సత్యం యెడ పట్టుదల వుంటే వాళ్లు భారత జాతిని కాపాడి తీరుతారనే విశ్వాసం నాకు వున్నది.

ఈ ప్రకరణాలు చదివిన పాఠకులు దక్షిణాఫ్రికాలో యీ సత్యాగ్రహ మహోద్యమం సాగియుండకపోతే, ఎంతో మంది భారతీయ సత్యాగ్రహులు అష్టకష్టాలు పడి యుండకపోతే యీ రోజున దక్షిణాఫ్రికాలో భారతీయులు పేరు వూరు లేకుండా పోయివుండేవారని, అంతేగాక బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినివేశ రాజ్యాలుగా వున్న మిగతా ఎన్నో దేశాలలో గల భారతీయులు కూడా చాలా వరకు రక్షణ పొందగలిగారు అని అంటే ఇందుకు కారణం దక్షిణాఫ్రికాలో భారతీయులు సాగించిన పోరాటమేనని గ్రహించియుంటారు. కొందరు భారతీయులు రక్షణ పొందక పోవడానికి కారణం. సత్యాగ్రహ సమరం మాత్రం కాదు. ఆయా దేశాలలో గల భారతీయులలో సత్యాగ్రహశక్తి లేదన్న మాట వాళ్లను రక్షించగలశక్తి భారతదేశానికి లేదన్నమాట.. సత్యాగ్రహం, ఒక అమోఘమైన ఆయుధం. అందు పరాజయానికి, నిరాశకు తావు లేదు. యీ సత్యానికి నేను వ్రాసిన యీ దక్షిణాఫ్రికా పత్యాగ్రహ చరిత్ర వల్ల ఏ కొంచెం బలం చేకూరినా కృతార్థుణ్ణే.