పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

369


వారి యీ కోరికలను సత్యాగ్రహ సమరంపత్రంలో చేర్చకపోయినప్పటికీ భవిషత్తులో భారతీయుల యీ కోరికలను విశాల హృదయంతో యోచించి ప్రభుత్వం వాటినన్నింటి అంగీకరించవలసి వుంటుందని యీ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. యిక్కడ నివసిస్తున్న భారతీయులందరికీ పౌరహక్కులు సంపూర్తిగా లభించనంత వరకు భారతీయులకు సంతృప్తి కలుగదని కూడా మనవి చేస్తున్నాను. .

“నాదేశ బంధుమిత్రులకు మీరంతా ధైర్యంతో ఓపిక పట్టండి. ప్రతి మంచి సాధనం సహాయంతో మీరంతా ప్రజాభిప్రాయాన్ని జాగృతం చేయండి అని విజ్ఞప్తిచేశాను. భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం మన మధ్య జరిగిన యీ ఉత్తర ప్రత్యుత్తరాలలో పేర్కొన్న విషయాలను షరతులను నెరవేర్చుటకు ముందడుగు వేయాలి. దక్షిణాఫ్రికా యందలి తెల్లజాతి వారు యిక గిరిమిటియా కార్మికుల ప్రథ రద్దు అయిపోయిందని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ఇమిగ్రేషన్ అక్టు వల్ల స్వతంత్ర భారతీయుల రాకడ కూడా ఆగిపోయినట్లేనని గ్రహింతురు గాక. యిక్కడి రాజకీయాలతోను, రాజకీయాధికారాల వ్యవహారాల తోను భారతీయులకు సంబంధం పెట్టుకోవాలనే మహత్వాకాంక్షలేదని తెలుసుకోగానే, పైన నేను తెలిపిన భారతీయుల కోరికలన్నింటినీ అంగీకరించ గలరని విశ్వసిస్తున్నాను. అది న్యాయ సమ్మతమని గ్రహించాలి. ఈ మధ్య యీ సమస్యలను పరిష్కరించుటకు మీ ప్రభుత్వం చూపించిన శ్రద్ధ, ఉదార భావన మీరు మీ జాబుల్లో పేర్కొన్న విధంగా చట్టాల అమలు విషయంలో కూడా చూపించినచో, యూనియన్ యందంతట గల భారత జాతికి శాంతి లభిస్తుందని తద్వారా ప్రభుత్వానికి భారతజాతి ఏరకమైన యిబ్బందీ కలిగించదని యీ జాబు ద్వారా తెలియజేస్తున్నాను.