పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

చరిత్ర

ఈ డచ్ వాళ్లనే దక్షిణాఫ్రికాలో బోయర్లు అని అంటారు పసిపిల్ల వాడు తల్లిని కరుచుకున్నట్లు డచ్‌వాళ్లు కూడా తమ భాషను కరుచుక్కూర్చుంటారు దేశస్వాతంత్ర్యానికి, భాషకు అవినాభావ సంబంధం ఉన్నదని ఉంటుందని డచ్‌వారి మనస్సుల్లో గాఢంగా నాటుకున్నది. దానితో వారి భాష అక్కడి వారందరికీ అందుబాటులోకి వచ్చింది. బోయర్లు హాలెండు ప్రజలతో దగ్గరి సంబంధం పెట్టుకోలేకపోయారు. అందువల్ల డచ్ వాళ్లు సంస్కృత భాషనుంచి వెలువడిన ప్రాకృత భాషల వలె, డచ్‌నుంచి వెలువడిన అపభ్రంశ డచ్ భాష మాట్లాడటం ప్రారంభించారు. వాళ్లు తమ పిల్లల మీద మరొభాషాభారం మోపడం యిష్టంలేక ఆ డచ్ అపభ్రంశ భాషకే స్థిర రూపం కల్పించారు ఆ భాషను 'టాల్' అని అంటారు ఆ భాషలోనే పుస్తకాలు వ్రాశారు పిల్లలకు ఆ భాషలోనే విద్య నేర్పుతున్నారు. అసెంబ్లీలో కూడా బోయర్లు ఆ భాషలోనే మాట్లాడుతారు. యూనియన్‌గా రూపొందిన తరువాత దక్షిణాఫ్రికా యందంతట రెండు భాషలు అనగా టాల్ లేక డచ్ మరియు ఇంగ్లీషు భాష సమాన హోదా అనుభవిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వ గెజెట్‌ను, అసెంబ్లీ వ్యవహారమంతటిని రెండు భాషల్లో ముద్రిస్తున్నారు

బోయర్లు ఆమాయకులు ధర్మ పరాయణులు వాళ్లు తమ విశాలమైన పొలాల్లో వుంటారు. అక్కడి పొలాల వైశాల్యాన్ని మనం ఊహించలేము మన రైతుల దగ్గర రెండు లేక మూడు ఎకరాలోలేక అంతకంటే తక్కువొ పొలం వుంటుంది కాని అక్కడి రైతుల దగ్గర వంద, రెండు వందల ఎకరాల విస్తీర్ణం గలపొలం వుంటుంది. యింత పెద్దపొలాన్ని వెంటనే దున్ని పంటపండించాలని డచ్ రైతులు భావించరు. ఎవరైనా యిదేమిటి అని ఆడిగితే “పడివుండనీయండి లోటు ఏమిటి? మేము కాకపోతే మా బిడ్డలు వ్యవసాయం చేస్తారు" అని అంటారు

పోరాట పటిమ మాత్రం ప్రతి బోయర్ యందు కనబడుతుంది. డచ్ వాళ్లు పరస్పరం కీచులాడుకుంటారు కాని పరాయివాడు దాడిచేస్తే మాత్రం తమదేశ స్వాతంత్ర్యం కోసం అంతా కలిసి ఐక్యంగా వుండి నిలబడి పోరాటం చేస్తారు. యుద్ధ శిక్షణ ప్రత్యేకించి వాళ్లకు యివ్వవలసిన అవసరం వుండదు