పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

201


తరగతిలోనే ప్రయాణం చేస్తూ వుండేవారు. కుమారి శ్లెసిన్ మాత్రం భారతీయుల ప్రక్కన కూర్చొని ప్రయాణం చేస్తూ వుంటే, తెల్లజాతి గార్డులు ఆమెను ఆపుటకు ప్రయత్నించేవారు. కాని ఆమె వాళ్లకు ఎదురుతిరుగుతూవుండేది. ఆమె కూడా నామాదిరిగా రైల్లో కష్టాలు అనుభవిస్తుందేమోనని భయపడేవాణ్ణి కాని ఆమె అలా జరగాలని ఎదురు చూస్తూ వుండేది. ఆమె శక్తి సామర్థ్యాలు, భారతీయుల సత్యాగ్రహసమరం మీద ఆమెకు గల పట్టు ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం గ్రహించింది. అయితే ఆమెను ఎన్నడూ నిర్బంధించలేదు. ఆమె జోలికి పోలేదు. ఆ మర్యాదను ప్రభుత్వం కాపాడుకున్నది

ఆమెకు నెలకు 6 పౌండ్లు యిచ్చేవాళ్లం ఆమె ఎన్నడూ పెంచమని కోరలేదు. ఆమె అవసరాలను తెలుసుకొని నేనే 10 పౌండ్లు చేశాను ఎంతో కష్టం మీద అందుకు ఆమె అంగీకరించింది. అంతకంటే ఎక్కువ జీతం తీసుకోనని చెప్పి వేసింది. "నాకు ఎక్కువ జీతం వద్దు నేను ఒక లక్ష్యంతో మీ దగ్గర పని చేయడానికి వచ్చాను జీతం ఎక్కువ తీసుకుంటే నా ధర్మాన్ని, నా లక్ష్యాన్ని మరిచిపోయిన దాన్నవుతాను" అని నాకు చెప్పింది. ఆమె మాటలు నన్ను కట్టి వేశాయి. ఆమె ఎంత వరకు చదువుకున్నదీ అని పాఠకులు అడగవచ్చు. ఆమె కేప్ యూనివర్సిటీ వారి ఇంటర్ మీడియట్ పరీక్ష ప్యాసైంది. షార్టు హాండు, టైపు పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ప్యాసైంది భారత జాతీయ సత్యాగ్రహ సమరం ముగిసిన తరువాత ఆమె యూనివర్సిటీలో డిగ్రీ చదువు పూర్తిచేసుకొని, యిప్పుడు ట్రాన్స్‌వాల్ యందలి ప్రభుత్వ బాలికాశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పని చేస్తున్నది

శ్రీ హర్బర్డ్‌కిచన్ ఒక మంచి సరళ హృదయుడు ఆంగ్లేయుడు విద్యుచ్ఛక్తి పని తెలిసినవాడు బోయర్ యుద్ధంలో ఆయన మాతో బాటు పని చేశాడు. కొంత కాలంపాటు ఆయన ఇండియస్ ఒపీనియన్ పత్రికా సంపాదకుడుగా పని చేశాడు. యావజ్జీవితం ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించాడు