పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

మొదటి ఒడంబడిక


సూచించిన మార్పును జనరల్ స్మట్సు అంగీకరిస్తే ఒడంబడిక చేసుకుందాం అని వారంతా చెప్పారు క్రొత్తగా జైలుకు వచ్చిన సత్యాగ్రహుల ద్వారా బయట వున్న భారతీయులు ఒడంబడిక మంచిగా వుంటే మీరు అంగీకరించండి మా కోసం ఆగవద్దు అని తమ సందేశం పంపించారు. ఆ ముసాయిదా మీద నేను శ్రీ క్విస్, తంబి నాయుడు సంతకం చేశాము. మా ముగ్గురి సంతకాలతో వున్న ముసాయిదాను శ్రీ కార్ట్ రైటుకు అందజేశాము

రెండో లేక మూడో రోజున 1908 జనవరి 30 వ తేదీనాడు జోహన్స్‌బర్గ్ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ వర్మస్ నన్ను జనరల్ స్మట్సు దగ్గరికి ప్రిటోరియా తీసుకొని వెళ్లాడు. మేమిద్దరం చాలా సేపు మాట్లాడాము. శ్రీ కార్ట్ రైటు తనకు చెప్పిన వివరాలు స్మట్సు నాకు చెప్పాడు. నేను జైలుకు వెళ్లిన తరువాత కూడా భారత జాతితమ పట్టు మీద నిలబడియున్నందుకు స్మట్సు నన్ను అభినందించారు. "నామనస్సులో మీ యెడ ఎన్నడూ కోపం గాని, ఏహ్యభావంగాని వుండనే వుండదు. నేను కూడా బారిష్టరు నని మీకు తెలుసు నాతోబాటు కొంత మంది భారతీయులు కూడా చదువుతూ వుండేవారు నేను నా కర్తవ్యాన్ని పాలిస్తున్నాను. తెల్లవారు ఝ చట్టాన్ని కొరుతున్నారు. యీ చట్టాన్ని కోరుతున్నవారిలో బోయర్లు లేరని, తెల్లవారు మాత్రమే వున్నారని కూడా మీకు తెలుసు ముసాయిదాలో మీరు సూచించిన మార్పును నేను అంగీకరిస్తున్నాను యీ విషయం నేను జనరల్ బోధాతో కూడా మాట్లాడాను. మీలో ఎక్కువ మంది పత్రాలను తీసుకుంటే నేను ఏషియాటిక్ చట్టాన్ని రద్దు చేస్తాను స్వేచ్ఛగా తీసుకున్న పత్రాలకు చట్టబద్ధత కల్పించే చట్టముసాయిదాను నేను తయారు చేస్తాను దాని ప్రతిమీకు పరిశీలనార్థం ముందుగా పంపుతాను యీ పోరాటం పునరావృతం కావడం నాకు యిష్టం లేదు. మీ భావాలను ఆదరించాలని నేను భావిస్తున్నాను" అని స్మట్సు అన్నాడు

ఈవిధంగా సంభాషణ జరిగిన తరువాత జనరల్ స్మట్సు లేచాడు “ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి? వాతో బాటు వున్న మిగతా ఖైదీల విషయం ఏమిటి?" అని నేను అడిగాను