పుట:తెలుగు వాక్యం.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

తెలుగు వాక్యం

అట్లా కాకుండా లింగ, పురుష, భేదాన్ని వివక్షించవచ్చు. అప్పుడా భేదాల్నిబట్టి కాను, కాము, కావు, కాడు, కాదు, కారు అనే రూపాలు చేరతై. ఈ రూపాలు భవిష్యదర్థంలో నిత్యంగా చేరతై. అందువల్ల ఇట్లా చేరిన రూపాలుగల వాక్యాలు భిన్నకాలార్థ బోధక సమర్థాలవుతాయి. ఉదాహరణకు - అతను మంత్రి కాడు అనే వాక్యానికి అతను ఇప్పుడు మంత్రి కాదు, అతను ఇక మంత్రి కాడు అన్న రెండర్థాలు ఉన్నై. ఈ రకపు వాక్యాలకు అరుదుగా విధి, సంప్రార్థనాది రూపాలు కూడా ఉంటై. అప్పుడు కా, కాండి , (కండి) అనే ఏకవచన, బహువచన రూపాలు వ్యతిరేక విధిలో ఉభయ వచనాలలోను కావద్దు అనే రూపం చేరతై .

ఉదాహరణ:

(12)

a. నువ్వు కలెక్టరువికా.
b. మీరు మంచి పౌరులు కండి,
c. మీరు ప్రజా వ్యతిరేకులు కావద్దు.

కొన్ని మండలాలలో కా అనే రూపానికి బదులు, కాలబోధక, వ్యతిరేక , అవ్యతిరేక రూపాలు రెండిట్లోను అవు అనే రూపం కన్పిస్తుంది..

1.16 : ఈ క్రియారహిత వాక్యాలకు అంతంలో అనే దీర్ఘాచ్చును చేరిస్తే ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతై. వాక్యార్థాన్ని రకరకాలుగా మార్చే కిలార్థ కాది రూపాలు గూడా ఇట్లాంటి వాక్యాల చివర చేర్చొచ్చు, వ్యతిరేకార్థకం గాని, ప్రశార్థకం గాని, కిలార్ధకాదులు గాని వక్తృవివక్షనుబట్టి ఉద్దేశ్య నామానికి కూడా చేర్చవచ్చు. ఇట్లా చేర్చటం వలన ఉద్దేశ్య నామాలకి ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంటే ప్రాధాన్య వివక్షకు పదక్రమ వ్యత్యాసమేకాక ఈ పేర్కొన్న వ్యతిరేక , ప్రశ్న, కిలార్థకాలను చేర్చటం కూడా ఒక పద్ధతి అన్నమాట. పదక్రమ వ్యత్యాసంలో ఉద్దేశ్య నామాన్ని ఆఖ్యాత స్థానానికి బరపటం వలన ఈ ప్రాధాన్యం ఏర్పడుతున్నది. ఆఖ్యాత స్థానంలో ఉన్న పదం ఆస్థానాన్నిబట్టి సహజంగానే ప్రధానమైనదని దీని అర్థం.

1.17 : క్రియాలోపం వల్లగూడా కొన్ని క్రియారహిత వాక్యాలు ఏర్పడతాయని పూర్వం సూచించ బడింది. వీటిల్లో కొన్ని ఉండు అనే క్రియ లోపించటం వల్ల ఏర్పడినవి. ఈ క్రింది వాక్యసమూహం ఈ రకపు వాక్యాలకు ఉదాహరణం.