పుట:తెలుగు వాక్యం.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

5

ఇట్లాంటి వాక్యాలలో విధేయనామం మానార్థకంగా ఉంటుంది. (6) లో ఉదాహరించిన పొడుగు, పొట్టి, లోతు, ఎత్తు. వంటి వన్నీ ఈ రకపు వాక్యాలలో ప్రయోగించవచ్చు.

1.14 : ఇవి కాక మరికొన్ని విభక్తి బంధాలు కూడా క్రియా రహిత వాక్యాలలో కన్పిస్తున్నై. ఉదాహరణకు ఈ కింది వాటిని పరిశీలించండి.

(9)

a. హైదరాబాదు నాకు కొత్త.
b. అతను ఈ ఊరికి పెద్ద.
c. మాతమ్ముడు మాలో పొడుగు.

ఈ పై వాక్యాలలో విధేయస్థానంలో ఉన్నవి విశేషణాలు. ఇవి విశేష్యాలుగా ప్రయుక్తమైనట్లు కన్పిస్తున్నై, అంటే కొన్ని పదాలను విశేషణ విశేష్యోభయ పదాలుగా గ్రహించాలేమో !

కొన్ని క్రియారహిత వాక్యాలు సంబంధ బోధకాలుగా కన్పిస్తై. వీటిల్లో సంబంధాన్ని సూచించే కు - విభక్తి బంధం కూడా ఉంటుంది .

(10)

a. అతను నాకు తమ్ముడు.
b. ఇతను నాకు స్నేహితుడు.
c. ఈమె నాకు స్నేహితురాలు.

1.15 : ఇంతవరకు ఉదాహరించిన వాక్యాలలో, క్రియ లేకపోవటమే కాకుండా కాలబోధకత లేకపోవడం కూడా గమనించవచ్చు. కాలాన్ని బోధించాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యాలకు అవు అనే క్రియను అనుబంధించాలి. అప్పుడు ఇతర వాక్యాలకులాగే . ఈ వాక్యాలకు కూడా భిన్నకాలాలను బోధించే క్రియారూపా లుంటై అట్లాంటి వాటిలో కొన్ని ఈ కింద ఉదాహరించిన వాక్యాలు.

(11)

a. అతను మంత్రి.
b. అతను మంత్రి అయ్యాడు.
c. అతను మంత్రి అవుతాడు.

ఇట్లాంటి వాక్యాలకు వ్యతిరేకార్థంలో కాలబోధకత లేనపుడు కాదు అనే వ్యతిరేకరూపం చేరుతుంది. ఈ రూపాన్ని అన్ని పురుషలలోను ప్రయోగించవచ్చు.