పుట:తెలుగు వాక్యం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

తెలుగు వాక్యం

4.13 : క్రమ వ్యత్యయాన్ని సహించే వాక్యాలు తరవాత శబ్దప్రయోగాన్ని సహించవు. "సుజాత తెలివైనది, ఆతరవాత అందమైనది” అనేవాక్యం సాధ్యమైనా సుజాత గుణాల్ని వర్ణించే వక్త ఆ గుణాల్లో తాను దేన్ని ప్రధానంగా పరిగణిస్తున్నాడో చెప్పుతుంది కాని, ఆ గుణాల కాల భేదాల్ని సూచించదు.

4.14: సంయుక్త పదబంధాలను కూడా సంయుక్త వాక్యాలనుంచి నిష్పన్నం చెయ్యవచ్చు. సమరూపకాలైన పదబంధాల్లో ఒకదానికి లోపం చెయ్యటంద్వారా ఇది జరుగుతుంది. ఆ ప్రక్రియ కింది వాక్యాల్లో చూడవచ్చు.

(230)

a. సుజాత సినిమాకు వెళ్లింది, సుశీల సినిమాకు వెళ్ళింది.
b. సుజాత, సుశీల - సినిమాకు వెళ్ళింది, సినిమాకు వెళ్ళింది.
c. సుజాత, సుశీల, సినిమాకు వెళ్ళారు.
d. సుశీల, సుజాత సినిమాకు వెళ్ళారు.

4.15: (230) లో c, d వాక్యాల్లో నామ బంధాలు క్రమవ్యత్యయం జరిగినా అర్థభేదం రాలేదు. కాని ఈ వాక్యాలు విడిగా భిన్నార్థ బోధకాలు, ఆ భిన్నార్థాలు కింది వాక్యాల్లో వ్యక్తమవుతున్నై.

(231)

a. సుజాత, సుశీల కలిసి సినిమాకు వెళ్ళారు.
b. సుజాత, సుశీల విడివిడిగా సినిమాకు వెళ్ళారు.

ఒకే సినిమాకు వెళ్ళారా, వేరు వేరు సినిమాలకు వెళ్ళారా అనేది వదిలేసినా వాళ్లు కలిసి వెళ్ళారా ? విడివిడిగా వెళ్ళారా అనేది (230) లో వ్యక్తం కాలేదు. భిన్న కర్తృకాలైన ఏకవ్యాపార మున్నప్పుడల్లా ఇల్లాంటి అస్పష్టత వాక్యంలో ఉంటుంది.

ఒకే వాక్యం బహు కర్తృకమూ, బహు కర్మకమూ అయినప్పుడు కర్తృ సంఖ్యను, కర్మ సంఖ్యనూ బట్టి ఈ అస్పష్టత పెరుగుతుంది. ఉదాహరణకు ఈ కింది వాక్యాలు చూడండి.

(232)

a. సుజాత సుశీల బజారు నుంచి పండ్లూ కూరగాయలు తెచ్చారు.
b. సుజాత బజారు నుంచి పండ్లు తెచ్చింది.
   సుశీల బజారునుంచి కూరగాయలు తెచ్చింది.