పుట:తెలుగు వాక్యం.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంయుక్త వాక్యాలు

99

లోపం జరిగింది. అది వ్యాకరణ సమ్మతం. (e) లో సర్వనామీకరణం జరిగింది. ఏకకర్తృకమైన వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా చేసినప్పుడు సనామ బంధలోపం జరిగి తీరాల్సిందేకాని సర్వనామీకరణం జరగటానికి వీల్లేదు. సమాన ప్రతిపత్తిగల వాక్యాలను కలిపినప్పుడు ఆఖ్యాతాలు ఏ వరసలో వచ్చినా అర్థం మారదు.

(228)

a. సుజాతకు డబ్బుంది, తెలివి ఉంది.
b. సుజాతకు తెలివి ఉంది, డబ్బు ఉంది.
c. సుజాత పొడగరి, రూపసి.
d. సుజాత రూపసి, పొడగరి.

4.12 : స్థితిబోధకమైన ఆఖ్యాతాలున్నప్పుడే ఇట్లాంటి పరివర్తన, అర్థ భేదాన్ని కలిగించదు. వ్యాపార, పరిణామ బోధకమైన వాక్యాలు కలిపినప్పుడు పూర్వపూర్వ క్రియలు పూర్వపూర్వ వ్యాపారబోధకాలవుతై. అంటే వాక్యంలో పూర్వవ్యాపారం, కాలంలో కూడా పూర్వవ్యాపారాన్నే బోధిస్తుంది. వాక్యాలను విడివిడిగా ఉంచినా కలిపినా అర్థవ్యత్యయం ఇట్లాగే ఉంటుంది.

(229)

a. సుజాత ఇంటికి వచ్చింది, చీరమార్చుకుంది, పొయ్యిమీద కాఫీకి నీళ్ళు పెట్టింది.

b. సుజాత ఇంటికివచ్చి, చీర మార్చుకుని, పొయ్యిమీద కాఫీకి నీళ్ళు పెట్టింది.

c. సుజాత ఇంటికి వచ్చింది. ఆ తరవాత చీర మార్చుకుంది. ఆ తరవాత పొయ్యిమీద కాఫీకి నీళ్ళు పెట్టింది.

(229) a, b వాక్యాలను c వాక్యపు గుప్త నిర్మాణం నుంచి నిష్పన్నం చెయ్యవచ్చు. అంటే a, b ల అర్థం c అర్థంతో సమానం. అందువల్ల ఈ వాక్యాల్లో ఆఖ్యాతాలు క్రమ వ్యత్యయాన్ని సహించవు, (229) b వంటి వాక్యాలు ఇంతకు ముందు పేజీల్లో సంశ్లిష్ట వాక్యాలుగా వ్యవహరించబడ్జె. ఇక్కడ సంయుక్తవాక్యా తుల్యాలుగా పరిగణించబడుతున్నై. గుప్త నిర్మాణ సంయుక్త వాక్యాలనుంచి నిష్పన్నమైన వ్యక్త నిర్మాణపు సంశ్లిష్ట వాక్యాలుగా వీటిని పరిగణించవచ్చు. (229) a, b లు రెండిట్లోనూ సనామబంధం లోపం జరుగుతుంది కాని, సర్వ నామ్నీకరణం జరగదు.