తెలుగుభాషా చరిత్ర : సింహావలోకనం 471
రూపం ద. ద్రా. ఉపకుటుంబంలో ఏర్పడ్డది. ఏన్/అన్‌లతోపాటు నేన్/నాన్ అనే జంటరూపాలు ఏకవచనంలో ఏర్పడటం ద. ద్రా. కుటుంబంలోనే కనిపిస్తుంది, *ఞామ్ నుంచి తెలుగులో నిష్పన్నమైన రూపం 'నేము'. ఇది శాసనభాషలో కనిపిస్తుంది (§ 6.28). ద. ద్రా. మొదటిశాఖలో ఎన్/నన్-, ఎన్-/నమ్-లు ద్వితీయావిభక్త్య౦గ రూపాలు. ఈ శాఖలో ఞాన్, ఞామ్>నాన్-, నామ్- శబ్దాల చివరి హల్లు లోపించటంవల్ల ద్వితీయావిభక్త్య౦గ రూపం ఏర్పడుతుంది. ఈ హల్లులు ఏక బహువచన బోధకాలు కావటంవల్ల 'నమ'ల భేదం ప్రథమహల్లుకు ఆరోపితమై నా-, మా-రూపాలేర్పడ్డాయి. ఈ విలక్షణతవల్ల తెలుగు తమిళాది ద. ద్రా. I శాఖకు చెందినదిగాదని, కూయి, కువి మొ.వాటికే సన్నిహితమని నిరూపించవచ్చు. మధ్యమపురుషలో ఏకవచన బహువచనాల్లో ప్రా.ద్రా.మాతృకలు *నీన్, *నీమ్ ద. ద్రా. I శాఖలో ద్వితీయావిభక్త్యంగ రూపాలు నిన్, నిమ్ అనీ, ద. ద్రా. II శాఖలో ద్వితీయావిభక్త్యంగ రూపాలు నిన్/*నీ-, *నిమ్/*నీ- అని రావలసి ఉండగా రెండోజత మిమ్-/ మీ-గా మారి ఏకత్వ బహుత్వ భేదాన్ని నిలుపుకొన్నది (చూ. కృష్ణమూర్తి 1968). ద్వితీయాద్యంగ సాదృశ్యంవల్ల నేము-/ మా-, మేము/మా-గాను, నిమ్ము/మీ- మిమ్ము/మీ-గాను మారిపోయినాయి. ద. ద్రా. భాషలన్నిటిలోను ప్రథమపురుష బహువచన ప్రత్యయం 'ర్', 'మ్' స్థానంలో రావటంవల్ల 'నీర్' అనే మరోరూపంగూడా ప్రా. ద. ద్రా. దశలోనే ఏర్పడ్డది. ద్వితీయాద్యంగ సాదృశ్యంవల్ల ప్రాక్తైలుగులో 'నీరు' 'మీరు'గా మారింది. కాని 'మిమ్ము' లో '*మీము' అనే పూర్వరూపం గూఢంగా నిల్చివుంది. ఓక్క తెలుగులోనే 'నీవు' రూపం కనిపిస్తుంది. ఇక్కడి 'వు' ఎలావచ్చిందో మనకు తెలియదు. ఓస్ట్య ప్రాబల్యంవల్ల తాలవ్యాచ్చు ఓష్ట్యాచ్చుగా మారి 'నువ్వు' రూపం అర్వాచీనంగా ఏర్పడి ఉంటుంది. ఆత్మార్థంలో ప్రా. ద్రా. *తాన్, *తామ్ శబ్దాలు తెలుగులో తాను, తాములుగా నిలిచిఉన్నాయి. కావ్యభాషలో బహుళంగా ఉన్న ఏను, ఏముల స్థానంలో నేను, మేములు సర్వత్రా వ్యాపించాయి.
ప్రథమ పురుషలో ప్రాచీన ద్రావిడ మాతృకలు *అవన్‌డు *ఇవన్‌డు అనీ ఉండేవి. వర్ణవ్యత్యయంవల్ల ప్రాక్తెలుగులో ఇవి వాన్ఱు, వీన్ఱుగా మారాయి. ఇక్కడ 'ఱు' ను దంతమూలీయ డు వర్ణంగా ఉచ్చరించే వారేమో! ఇవి 9వ శతాబ్దికే వాణ్డు, వీణ్డుగా మారాయి (చూ. సూత్రం. 12). ద. ద్రా. I శాఖలో చివరి 'ఱు' వర్ణం లోపం వచ్చి అవన్, ఇవన్ శబ్దాలే మాతృకలైనాయి. అమ