470 తెలుగు భాషా చరిత్ర
- ఇర్-దరు; ఈ పదంలో రెండోభాగం అందఱు, ఇందఱు, ఎందఱు లలోగూడా-
కనిపిస్తుంది. బహుశా, ఇరువురు/ఇద్దఱు వర్గమాండలికాలై ఉంటాయి. నన్నయ కాలానికే రెండూ కావ్యభాష కెక్కాయి. క్రమంగా 'ఇరువురు' రూపం జారి పోయింది.
16.12. 'ఒక్కణ్డు'కు ఔపవిభక్తి రూపంగా ఏర్పడ్డ ఒక్కటి ప్రథమలో గూడా నిలిచిపోయింది. చారిత్రకంగా ఇది అర్వాచీనం (§4.48). ఏఴు 8వ శతాబ్దికే ఏడుగా మారింది (ఴ > డ). చూ. ఏఴు (క్రీ. శ. 725), ఏడు (క్రీ. శ. 742-98) (§3.37). ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల చరిత్ర మనకు స్పష్టంగా తెలియదు. 'ఎణుంబొది'అనే ప్రాచీనరూపంలో 'బొది' పదికి రూపాంతర మని ఒక ఊహ. ఎనిమిది/ఎన్మిది 12 వ శతాబ్ది నుంచి బహుళం (§ 4.48). తొమ్మిదికి తొంభ అనే ఒత్తక్షరమున్న రూపం క్రీ.శ. 1008 లోనే శాసనాల్లో దొరికింది (§ 3.37). పదికి ఈ నాడు వాడుకలో కనిపించే రూపభేదా లన్నీ కొన్ని శతాబ్దుల కిందటనే ఏర్పడ్డాయి. ఇరుభది (క్రీ. శ. 682), ఇర్వయి (క్రీ.శ. 1250), ముప్పై (క్రీ.శ. 1280), నల్ఫయి (క్రీ.శ. 1250), నలభయి (క్రీ.శ 1600, ఎంబై (క్రీ.శ. 1291), యాంభది (క్రీ.శ. 1600), అణువై (క్రీ.శ. 1390), ఎనబై (క్రీ. శ. 1394), తొంభయి (క్రీ.శ 1384). 13 వ శతాబ్దినుంచి ది>యి అయిన రూపాలు కొల్లలు (§§ 3.37, 4.48, 5.37, 6.29). పండ్రు౦డు < పన్-రెండు. ఇక్కడ 'డ', వాండ్రు, మొ. శబ్దాల్లో లాగా సంధివశానవచ్చింది (చూ. సూత్రం 13). - వురు > -గురు 12వ శతాబ్దినుంచి శాసనాల్లో కనిపిస్తుంది. (§ 4.48) పూరణార్థంలోవచ్చే అవు - > అవ- > ఓ - మార్పు 12వ శతాబ్దికే పూర్తి అయింది. మూండోనడపు (క్రీ. శ. 1186), రెండోమేళం (క్రీ. శ. 1518).
16.13. ఒక్క తెలుగులో తప్ప మరే ద్రావిడ భాషలోను సహస్ర సంఖ్యకు దేశ్యశబ్దంలేదు. తెలుగులో వేయు (క్రీ. శ. 633-63), వేలు (క్రీ. శ. 1008) మొ. శబ్దాలు మొదటినుంచి కనిపిస్తాయి.
16.14. సర్వనామాలు : ఉత్తమ పురుషలో ఏను, ఏము రూపాలకు ప్రా. ద్రా. మాతృకలు *యాన్, *యామ్. ఉభయార్థంలో ప్రా. ద్రా. లో *ఞామ్ అనే రూపం ఉండేది. పై రూపాల సామ్యంవల్ల *ఞాన్ అనే మరో ఏకవచన