ప్రకరణము 12
తెలుగులిపి పరిణామం
- తిరుమల రామచ౦ద్ర
12.0. యరలవ మదనస యనుచును
బరువడి నీ యక్షరముల భయనయతతులన్
నిరతమును వ్రాయనేర్చిన
వరకరుణా వానివ్రాలు వట్రువలమరున్
(వేటూరి ప్రభాకరశాస్త్రి, చాటుపద్య మణిమ౦జరి)
మన దస్తూరీ గుండ్రంగాను, అందంగాను అమరడానికి మనపూర్వులెవరో పైన పేర్కొన్న పదాన్ని గోసాయిచిట్కాగా చెప్పారు. ఇప్పటి అక్షర సమామ్నాయం స్వరూపం చూచి ఇది మొదటినుంచి ఆణిముత్యాలకోవ అని ఎవరూ అనుకోరాదు. ఎన్నో వంకరటింకరగీతలు రాతిబండలమీద, రాగిరేకులమీద, తాటాకులమీద, కడితాలమిద రాపాడిరాపాడి ఇప్పటి స్వరూపం తీర్చుకొన్నాయి. ఈ పరిణామానికి దాదాపు రెండువేల యేండ్లు పట్టింది.
భాష ధ్వనిరూపంలో వ్యక్తమవుతుంది. ఈ ధ్వనులు ఇవి, ఇన్ని వీటికి ఇవి గుర్తులు అనే నిర్ణయమే అక్షర సమామ్నాయం. అక్షరమంటే క్షరంకానిది; నశించనది. మాట, పలుకు గాలిలో కలిసిపోతాయి; కాని వాటి సంకేతమైన అక్షరం మాత్రం ఎన్నేండ్లయినా ఉంటుంది.
12.1. ప్రాచీన పారశీకులు బాణాలవంటి - గుర్తులతో ఒక లిపిని వాడుక చేశారు. దీనిని పాశ్ళాత్యవిద్వాంసులు 'క్యూనీఫారం' లిపి అన్నారు. ఈజిప్టు దేశంలో ఒకప్పుడు చిత్రలిపిగా ఉన్నది క్రమంగా వంకరగీతల. లిపిగా మారి ప్రపంచమంతా వ్యాపించి పెక్కులిపులకు మాతృక అయిందని పాశ్చాత్యవిద్వాంసుల వాదం.