Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

344 తెలుగులిపి పరిణామం

  12.2. మన భారతీయలిపికూడ చాల ప్రాచీనమైనదని, చిత్రలిపినుంచే

స్వతంత్రంగా పరిణమించినదని పలువురు ప్రాచ్యపాశ్చాత్య విద్వాంసుల విశ్వాసం మనకు ప్రాచీనతమసాహిత్యమైన ఋగ్వేదంలోను (ఋగ్వేదం 1-164-24), యజుర్వేదభాగమైన తైత్తిరీయసంహితలోను ఉన్న అక్షరచర్చను, శతపథ బ్రాహ్మణంలోఉన్న అక్షరవర్ణచర్చనుబట్టి, పంచవింశ బ్రాహ్మణంలోఉన్న గణన విధానాన్నిబట్టి, శతపథ బ్రాహ్మణంలోని సమయచర్చనుబట్టి మనకు లేఖన పద్దతి ఉండి ఉంటుందని ఊహించడానికి అవకాశముంది. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్ది వాడైన పాణిన్యాచార్యుడు లిపి, లిపికరశబ్ధాలను, 'యవనానీ' అనేలిపి విశేషాన్ని తెలుపడంవల్ల (అష్టాధ్యాయి 4-1-49, 1-3-75, 1-3-87, 4-3-116, 1-9-4), క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దివాడని పండితులు విశ్వసించే కౌటిల్యుని అర్థశాస్త్రం రాజకుమారులు చౌలవిధి తర్వాత లిపి, సంఖ్యాగణనం నేర్చుకోవాలని చెప్పడాన్నిబట్టి, లిపి మనకు ప్రాచీన కాలంనుంచి ఉన్నట్లే స్పష్టమవుతున్నది. వైదికసాహిత్యంలోనే కాక జైనబౌద్ధసాహిత్యాలలో లిపి ప్రస్తావన కోకొల్లలు. క్రీస్తుకు పూర్వం 300 ఏండ్లనాటి జైనుల సమవాయాంగణ సుత్తంలో 18 లిపులు, మహాయానబౌద్ధుల ప్రథమ ప్రమాణ గ్రంథమైన లలితవిస్తరంలో 64 లింపులు (లిపిశాలా సందర్శన పరివర్త౦) ఉదాహృతాలు. బుద్దునికిముందునుంచే తమిళ సంగం సాహిత్యంలో లేఖనసంప్రదాయం ఉన్నట్లు శ్రీ టి. వి. మహాలింగం తెలిపారు: (ESIP 110-126).

  12.3. ఇటీవల పురాతత్వశాస్త్రజ్ఞులు శ్రీ ఐ.కార్తికేయశర్మ అమరా

వతిలో జరిపిన త్రవ్వకాలలో వెలువడిన ప్రాచీన శాసనాన్నిబట్టి తెలుగుదేశంలో లిపి అశోకుని ముందునుంచే ఉన్నట్లు స్పష్టమవుతున్నది. (తెలుగుభాషాసమితి, విఙ్ఞాన సర్వస్వం, లలితకళ సంపుటి - అమరావతి). ఈ శాసనలిపి అశోకశాసనాలలిపికి సన్నిహితంగా ఉన్నది. ఈ లిపిని బ్రాహ్మీలిపి అని వ్యవవారించారు.

 ఈ బ్రాహ్మీలిపి మనదేశ౦లో చిత్రలిపితో రూపు దాల్చిందని సర్‌ కనింగ్‌

హామ్‌ వాదం (CII 1;52). కాని డేవిడ్‌ డిరింజర్‌, జార్జ్ బ్యూలర్‌ మొదలయిన వారు బ్రాహ్మీలిపి ఈజీప్టుచిత్రలిపినుంచి ఆవిర్భవించిన ఫోనీషియన్‌ లిపినుంచి పుట్టిందని భావించారు. శ్రీ ఆర్‌. ఓ. దేశ్‌పాండే ఈ వాదాలను ఖండించారు. (IP 1. 35, 38, 48). బ్రాహ్మీలిపి పుట్టుక సంగతి ఎలా ఉన్నా దీనినుంచే భారతదేశ౦ లోని లిపులన్నీ పుట్టాయి. ఇంతకుముందు చెప్పిన అమరావతి శాసనాలు కాక,