278 తెలుగు భాషా చరిత్ర
స్కూల్‌ఫైనల్ విద్యార్థి ప్రాచీన నవీన పాఠ్యగ్రంథాల్లో వేటినయినా చదివే అవకాశమిమ్మని అభ్యర్థించగా ప్రభుత్వానుమతి సెప్టెంబర్ 20న (జి. ఒ. 3098) లభించింది. ఇది గ్రా౦థికవాదానికి తొలివిజయం. ఆ తరవాత మరింత ఒత్తిడి చేసి, ఒక్కొక్క విద్యార్థికాక ఒక్కొక్క పాఠశాల ఈ రెండు రకాల్లో ఏరకం గ్రంథాలను నిర్ణయిస్తే అదే ఆ బడి మొత్తానికి అన్వయించాలనే ఉత్తరువును సెఫ్టెంబర్ 29 న (జి. ఒ 3479) సంపాదించారు. ఇది మలి విజయం, దీంతో మరింత పుంజుకొని వ్యావహారికవాదాన్ని అవహేళనచేస్తూ పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు 'గ్రామ్యవాదుల భాషాపవాద' మనే పుస్తకం ప్రచురించారు.
ఇది ఇలా ఉండగా తమకు ఆంగ్ల భాషాజ్ఞానమేకాని ఆంధ్రభాషాపరిచయం లేదన్న అపప్రథను పోగొట్టుకోడానికి గిడుగువారు 'ప్రాఁదెనుఁగుఁగమ్మ' ప్రకటించారు. అనాటి వైయాకరణుల్లో సర్వోత్తము లనిపించుకున్న తాతా సుబ్బరాయశాస్త్రిగారు 'ఆ౦ధ్రభాషాసంస్కరణ' మనే వ్యాసంలో (అం. సా. ప. ప. సం. 2 (1912), సం. 3) ఏ భాషనైైనా పూర్ణంగా సంస్కరించటం మానవాసాధ్యమని, సంస్కృతానికి పాణిన్యాదుల వ్యాకరణాలే చాలవని, మన పూర్వులు కూడా శిష్టా ప్రయోగానుగుణంగా ఆయాకాలాల్లో వ్యాకరణసంస్కరణం చేసేవారని, ఇప్పటి శిష్టాచారం ప్రకారం తెలుగు వ్యాకరణాన్ని సంస్కరించాలని, అన్యదేశ్యాలు స్వీకరించకపోతే వ్యవహారహాని సంభవిస్తుందని, అక్షరసమామ్నాయంనుంచి అర్ధానుస్వార శకటరేఫలను తొలగించాలని శాస్త్రనిదర్శనాలను ఉదాహరిస్తూ వ్యావహారికవాదాన్ని సమర్థించారు. వజ్ఘల చిన సీతారామశాస్త్రిగారు 'ఆంధ్రభాష' అనే వ్యాసంలో (ఆం. సా. ప. ప.సం. 2(1912), సం.4) మనపూర్వవ్యాకరణ సూత్రాలనే పాటించదలిస్తే కావ్యప్రపంచమంతా గ్రామ్యతాభూయిష్ట మవుతుందని, ఒకనాటి గ్రామ్య మిప్పుడు కాదని వాదించారు. మద్రాసు రాజధాని కళాశాలలో వాసుదాసుగారి అధ్యక్షత క్రింద 1912 డిసెంబరు 11, 12 తేదీలలో ఆంధ్రభాషాభివర్ధనీ సమాజమువారు బుర్రా శేషగిరిరావుగారిచేత 'ఆంధ్రాంగ్ల భాషల్లో వ్యావహారికభాషా ప్రయోజనాల మీద ఉపన్యాసాలిప్పి౦చారు. ఆ సమయంలో సభాధ్యక్షులు ఖండనోపన్యాసం చేస్తూ, అక్షరసంఖ్యనుబట్టి చూసినా తెలుగే ఇంగ్లీషుకన్న అభివృద్ధిచెందిన భాష అని గ్రాంథికభాషలో అన్యదేశాలు కొద్దిగా ఉండగా మాండలికాలు మొదలేలేవని, వ్యావహారికమనే భాషకు ఒక వ్యాకరణంగాని నిఘంటువుగాని లేనందున అప్రామాణికమైన ఆ భాషలో రచించరాదని ఆక్షేపించారు.