పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రా౦థిక వ్యావహారిక వాదాలు 277

భాలవ్యాకరణమే శరణ్యమని వారి భావం. వ్యావహారికరచనల్లో మాండలిక పదజాలంచేరి భాషా 'పరిశుబ్రత' చెడిపోతుందని వారి విశ్వాసం. జయంతి రామయ్యగారు వ్యావహారిక రచనల్లో 'సులభత' లేదని నన్నయనాటికే 'స్థిర'పడ్డ తెలుగుకూ, షేక్సిపియర్‌ కాలంవరకూ మారుతూవచ్చి అప్పుడే స్థిరపడ్డ ఇంగ్లీషుకూ పరిణామక్రమంలో భేదంలేదని, మాండలికమయమైన నిస్సారకవితతో నిండిన గ్రామ్యగ్ర౦థాలు పాఠ్యగ్ర౦థాలుగా పనికిరావని వాదించారు. అన్యభాషాపదాలతో నిండిన వ్యావహారికం సుబోధకంకాదని, ఉన్నపదజాలం గ్రంథరచనకు చాలదని, వ్యాకరణ విరుద్ధమైన వ్యావహారికపదాలు నిషిద్ధాలని వేమూరి విశ్వనాథశర్మగారు అభిప్రాయపడ్డారు. విసంధి పాటించటం, అర్దానుస్వార, శకటరేఫలు వదిలి వేయటం, అన్యదేశ్యాలు వాడటం తప్పని వారి మతం. వ్యావహారికరచనలు పాఠ్యగ్ర౦థాలు కారాదని శాసించగోరుతూ పరిషత్తువారు ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించ నిర్ణయించినారు. అందులోని ముఖ్యాంశాలివి : (1) “పన్నెండో శాతాబ్దినాటి” (?) నన్నయనుంచి నేటి కందుకూరివారివరకూ గ్రాంథికభాషమారనేలేదు. (2) పూర్వకవులందరూ ఏనాటి భేదమూలేని ఒకేభాషారీతిలో రాశారు. కాబట్టి గ్రాంథికంలో ఏకరూపత (Uniformity), దానికి ప్రామాణికత ఉన్నాయి. (3) ఆధునికా౦ధ్రభాషకు ప్రత్యేకస్థానం లేదు. (4) భవిష్యత్తులో దుర్గ్రాహ్యమూ దుర్చోధమూ అయ్యే ఈ వ్యావహారికానికి వ్యాకరణసూత్రాలు లేవుకాబట్టి అది పాఠ్యగ్ర౦థరచనకు పనికిరాదు.

9.13. పై సిద్ధాంతాలతో అంధ్రదేశంలోని కవిపండిత మేధావులందరినీ ఈ రెండు సంఘాలవారూ ముగ్గులోకి దింపేరు. కాలక్రమాన చర్చలవేడి పెరిగింది. 1912 మే 15, 16 తేదేలలో పరిషత్తు ఆధ్వర్యంలో మద్రాసులో ఒక పండితసభ జరిగింది. దానికి కొమర్రాజు లక్ష్మణరావుగారు అధ్యక్షులు, పేరి కాశీ నాథశాస్త్రిగారు లౌకికవైదికసంస్తృతాల మధ్య ఉన్నట్లే గ్రా౦థికవ్యావహారికాల మధ్య 'వ్యాకరణసిద్ధ' మైన భేదముందీని వాదించారు. వాదప్రతివాదాల తర్వాత, పిల్లల పుస్తకాల్లోమాత్రం విసంధి పాటించాలని, అన్యత్రా గ్రాంథికమే శరణ్యమని తీర్మానించారు.3 ఆ తరవాతి నెలలో వేదంవారి 'గ్రామ్యాదేశ నిరసన' మనే పుస్తకం ఈవాదానికి మంచి సమర్థన గ్రంథంగా వెలువడింది. గ్రామ్యగ్రా౦థిక వివాదంలో తమ విశ్వాసాలను వివరిస్తూ పరిషత్తువారు తయారుచేసిన వినతిపత్రాన్ని ఆగస్టు 7 న సర్‌ బయ్యా నరసింహేశ్వరశర్మగారు గవర్నరుకు సమర్పించారు.