పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136 మూషికాసుర విజయము.

యీకలియుగం నిలిచివున్నది. నేను ఒక్కపనిచేసుకు వచ్చినాను అందులో నాకు నీసహాయంకావలెను.

భార్య---ఏమి చేసుకుని వచ్చినాతో చెప్పండి. నాచేత నయినపని నేనుచేస్తాను.

మూష--అదియేమీ గొప్పపనికాదు. నేను వకచెవులపిల్లితో కూడా పరుగెత్తడానికి పందెంవేసి వచ్చినాను. పందెమున గెలిస్తే మనకు పదివరహాలు వస్తని. ఆచెవులపోతుకు తానేమో నాకంటే మహావేగంగా పరుగెత్తగలనని యెంతో గర్వము. ఇలాగర్వపడే వాళ్ళు బుద్ధిహీనులు గాని తెలివిగల వాళ్ళుకారు. మనంవక మహేంద్రజాలం చేసి దాన్ని యేలాగయినా గెలువవలెను.

భార్య--- మీకు యేమి మతి పోయిందా యేమిటి? పొట్టయుఈడ్చుకుంటూ కదలలేని పుట్టాపందికొక్కు యెక్కడ ఆగమేఘాల మీదయెగసి పోయే కుందీలుతో పరుగెత్తడం యెక్కడ? యీరోజునమీకు యేమీపిచ్చయెత్తలేదుగద?

మూష---నోరుమూసుకో, భార్యభర్తమాటకు యెదురాడకూడదు. నోరెత్తక నేనుచెప్పినట్టు చెయ్యి. పురుషులు చెప్పినట్టెల్లా చెయ్యడం కులస్త్రీలకు ధర్మంగాని లేనిపొని ప్రశ్నలు వెయ్యకూడదు. పురుషుల వ్యవహారాలూ రాచకార్యాలూ ఆడవాళ్ళకు మీకు యేమి తెలుస్తవి?

భార్య---మీరన్నట్లు మాకేమీ తెలియవుగాని--

మూష---నోరుముయ్యి, నాయెదుట భయంలేకుండా మళ్ళీ మాటాడుతావు? నేనుయిప్పుడు చెప్పినట్లు నీవు చేస్తావా చెయ్యవా! నాఆజ్ఞ వినకపోతే యీకర్ర యిపుడు నీవీపుమీద విరుగుతుంది.

భార్య---మీ ఆజ్ఞ వినకుండా వుండవుండడానికి గుండెలున్నవా? ఏమిఆజ్ఞాపిస్తారో ఆజ్ఞాపించండి. మీఆజ్ఞకు బద్దురాలనయి చేతులు కట్టుకొని చేస్తాను. మొగుడు భార్యను గొదావరిలో దూకుమంటే దూకవలెను.

మూష---ఓప్రియురాలా! ఈనాగటి చాళ్ళలోపడి యీపొలంలో యీకంచెదగ్గర నుంచి ఆకంఛెదాకా మేము పందెం వేసి పరుగెత్తుతాము. నీవుయిక్కడ దాగివుండి ఆకుందేలు పరుగెత్తుకుని రావడంతోటే చటుక్కున పయికి వచ్చినేను ముందువచ్చినానని అంటూవుండు. అతనుమళ్ళీ పరుగెత్తుతుంటే మంచిదని నాలుగడుగులు పరుగెత్తి కుందేలుదాటి పోయిన తరువాత వెనుకనిలబడు. రూపంచూస్తే నాకూనీకూ భేదం తెలియదు గనుక ఆకుందేలుగాడు నీవేననుకుంటాడు. అప్పుడుపందెం మనంగెలుస్తాము. అదుగో కుందేలాకంచెవద్దకు పోతూవున్నది. నీవు కనపడకుండా దాక్కునివుండు. ఈలోగా నీకూనాకూ భేదం తెలియకుండా వుండడానికి నామొగాన్ని వున్నట్టే నీవుకూడా మొగాన్ని నామాలుపెట్టుకుని శ్రీవైష్ణవుని వలెవుండు.