పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0114-01 సాళంగనాట సం: 02-079 విష్వక్సేన

పల్లవి: అదెవచ్చె నిదివచ్చె నచ్యుతు సేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు ॥పల్లవి॥
    
చ. 1: గరుడధ్వజంబదె ఘన శంఖరవమదె
సరుసనే విష్ణుదేవుచక్రమదె
మురవైరి పంపులవె ముందరిసేనలవె
పరచి గగ్గుల కాడై పారరో దానవులు
    
చ. 2: తెల్లని గొడుగులవె దేవదుంధుబులునవె
యెల్ల దేవతల రథాలింతటానవె
కెల్లురేఁగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళానఁ బడరో దనుజులు
    
చ. 3: వెండిపైఁడి గుదెలవె వెంజామరలవె
మెండగు కైవారాలు మించినవవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టెనదె యిదె
బండుబండై జజ్జరించి పారరో దైతేయులు