పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0114-02 లలిత సం: 02-080 వైరాగ్య చింత

పల్లవి: అయ్యో నేనేకా అన్నిటికంటెఁ దీలు
గయ్యాళినై వ్రిధా గర్వింతుఁగాని
    
చ. 1: తడిపివుదికినట్టి ధౌతవస్త్రములు నా-
యొడలు మోఁచినమీఁద యోగ్యము గావు
వుడివోక వనములో వొప్పైనవిరులు నే-
ముడిచి వేసినంతనే ముట్టరాదాయను
    
చ. 2: వెక్కసపు రచనల వేవేలు రుచులు నా
వొక్కనాలుకంటితేనే యోగ్యముగావు
పక్కన దేవార్హపుఁ బరిమళ గంధములు నా-
ముక్కుసోఁకినంతలోన ముట్టరాదాయను
    
చ. 3: గగనాననుండి వచ్చేగంగాజలములైన
వొగి నాగోరంటితేనే యోగ్యము గావు
నగు శ్రీవేంకటపతి నన్నే రక్షించినదాఁక
మొగడై యెరుక తుదిముట్టరాదాయను