పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0113-05 మాళవి సం: 02-077 శరణాగతి

పల్లవి: బలువుఁడు హరిఁ జేపట్టితిని
తలఁచినదెల్లా దక్కెను నాకు
    
చ. 1: దురితధ్వంసుఁడు దుఃఖవిదారుఁడు
అరిభయంకరుఁ డచ్యుతుఁడు
సిరివరుఁ డితనినిఁ జేకొని కొలిచిన
పరమసుఖమెపో భయ మెక్కడిది
    
చ. 2: దానవాంతకుఁడు దైవశిఖామణి
మానరక్షకుఁడు మాధవుఁడు
నానాముఖముల నాపాలఁ గలఁడు
యేనెపముల నా కెదురే లేదు
    
చ. 3: అనయము నిర్మలుఁ డఖిలానందుఁడు
ఘనుఁ డీశ్రీవేంకటవిభుఁడు
కనుకొని మము నిటు గాచుక తిరిగీ
యెనయఁగ నేలికె యితఁడే మాకు