పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0113-04 లలిత సం: 02-076 వైరాగ్య చింత

పల్లవి: అవి యటు భావించినట్లాను
కవగొని యిందుకుఁ గలఁగరు ఘనులు
    
చ. 1: అరయఁగ నేఁబదియక్షరములె పో
ధరలోపల నిందాస్తుతులు
సరిఁ బురాణములు శాస్త్రవేదములు
యిరవుగ నిన్నియు నిందే పొడమె
    
చ. 2: వొక్క దేహమున నున్నయంగములు
పెక్కువిధములై బెరసినవి
చిక్కులఁ గొన్నిటి సిగ్గుల దాఁతురు
యెక్కువ యతులకు నిన్నియు సమము
    
చ. 3: అంతరాత్మలో నంతర్యామై
బంతులఁ దిరిగేటి బంధువులు
చింతింప నతఁడే శ్రీవేంకటేశ్వరుఁ-
డింతకుఁ గర్తని యెంతురు బుధులు