పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0113-03 బౌళి సం: 02-075 అధ్యాత్మ

పల్లవి: అన్నియును హరి సేసే యటమటాలే యివి
పన్నిన సుజ్ఞానికి బయలై తోఁచు
    
చ. 1: తిరుపై యవ్వలవ్వలఁ దిరుగుచుండేటివేళఁ
దిరిగినట్లనుండు దిక్కులెల్లాను
సిరుల సంసారభ్రమఁ జిక్కిన జీవునికిని
పరగ నైహికమే పరమై తోఁచు
    
చ. 2: సొగసి యద్దమునీడ చూచినవేళఁ దనకు
మగుడ వేఱొకరూపు మతిఁ దోఁచును
తగిలి యిట్లానేపో తనుఁదా నెఱఁగకున్న
నిగిడిన పుట్టువులు నిజమై తోఁచు
    
చ. 3: కదిసిన సకలాంధకార మంతటాఁ గప్పి
వుదయమైతే నన్నీ నొదిగినట్టు
హృదయపు శ్రీవేంకటేశుఁడు వెల్లవిరైతే
మదిలో నజ్ఞానము మాయమై తోఁచు