పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0113-01 మాళవి సం: 02-073 నామ సంకీర్తన

పల్లవి: ధ్రువవరదా సంస్తుతవరదా
నవమైన యార్తుని నన్నుఁ గావవే
    
చ. 1: కరిరాజవరదా కాకాసురవరదా
శరణాగతవిభీషణ వరదా
సిరుల వేదాలు నిన్నుఁ జెప్పగా వినీని
మరిగి మఱఁగుచొచ్చే మమ్ముఁ గావవే
    
చ. 2: అక్రూరవరదా అంబరీషవరదా
శక్రాది దివిజనిచయవరదా
విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు
చక్రధర శరణంటి సరిఁగావవే
    
చ. 3: ద్రౌపదీవరదా తగ నర్జునవరదా
శ్రీపతీ ప్రహ్లాదశిశువరదా
యేపున శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుఁడు
చూపఁగా గొలిచే నచ్చుగఁ గావవే