పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0112-06 రామక్రియ సం: 02-072 అద్వైతము

పల్లవి: సేయనివాఁ డెవ్వఁడు చేరి చిల్లరదోషాలు
యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే
    
చ. 1: దేవుని నమ్మినయట్టి దేహియట యాతనికి
యీపల నెంతటిపాపమేమి సేసును
భావించి యన్ని నేరాలు పరిహరించు నతఁడే
ఆవటించు సూర్యునికి నంధకార మెదురా
    
చ. 2: పూజింపించుకొనేవాఁడు భువనరక్షకుఁడట
తేజముతో దురితాలు తెంచఁగలేఁడా
రాజు సేసిన యాణాజ్ఞ రాజుకంటే నెక్కుడా
వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు
    
చ. 3: చేతనాత్మకుఁడట శ్రీవేంకటేశ్వరుఁడు
జాతిలేని జీవునికి స్వతంత్ర మేది
కాతరపు జన్మానకుఁ గార్యకారణ మేది
యేతున గరుడనికి నెదురా పాములు