పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0112-03 మలహరి సం: 02-069 వైరాగ్య చింత

పల్లవి: ఈహీ శ్రీహరిఁ గంటే యింత లేదుగా వట్టి-
దాహపుటాసల వెఱ్ఱి దవ్వు టింతేకాకా
    
చ. 1: పలుమారు నిందరిని భంగపడి వేఁడేది
యిలపై దేహము వెంచేయిందు కింతేకా
కలికికాంతలచూపు ఘాతలకు భ్రమసేది
చెలఁగి మైమఱచేటి చేఁత కింతేకా
    
చ. 2: పక్కన జన్మాలనెల్లాఁ బాటువడేదెల్లాను
యెక్కడోసంసారాన కిందు కింతేకా
వొక్కరిఁ గొలిచి తిట్టు కొడిగట్టేదెల్లాను
చక్కుముక్కు నాలికెపై చవి కింతేకా
    
చ. 3: గారవాన ధనములు గడియించేదెల్లాను
ఆరయ నాదని వీఁగేయందు కింతేకా
చేరి శ్రీవేంకటపతి సేవకుఁ జొరనిదెల్లా
భారపుఁ గర్మపుబాధఁ బట్టువడికా