పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0112-04 బౌళి సం: 02-070 భక్తి

పల్లవి: ఎంత బాఁప నా సోద మింత గలదా
అంతయు నీమహిమే హరిభట్లూ
    
చ. 1: సూరిభట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి
వారబియ్య మెత్తియెత్తి వడదాఁకి
నీరువట్టుగొని భూమి నీళ్లెల్లా వారవట్టీ
కేరికేరి నగవయ్య క్రిష్ణభట్లూ
    
చ. 2: దేవరొజ్ఝ లొకవంక దిక్కులలోఁ బొలగూడు
దీవెనతో నారగించి తీపుమరిగి
యీవలఁ బెట్టినవారికేమైనా నొసఁగీని
వేవేలు మాయల విష్ణుభట్లూ
    
చ. 3: సోమయాదు లొకవంక సొరిది సురలకెల్లా
నామనితో విందువెట్టీ ననుదినము
హోమపు విప్రులసొమ్ము లొడిసి తాఁ బుచ్చుకొని
వేమరు శ్రీవేంకటాద్రి వెన్నుభట్లూ