పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0112-02 రామక్రియ సం: 02-068 భక్తి

పల్లవి: అన్నిటా శ్రీహరిదాసుఁడగు వానికి
కొన్ని దైవములఁ గొలువఁగఁ దగునా
    
చ. 1: విహితకర్మముసేసి వెదకేటి హరి నిట్టె
సహజమై కొలచేటి సరసునికి
గహనపుఁ గర్మాలు కడమలైన నేమి
మహిఁ గనక్రాదికి మరి పైఁడి వలెనా
    
చ. 2: పలుదానములకెల్ల బలమైన హరి నిట్టె
బలుపుగ జేకొన్న భక్తునికిని
నెలకొని యాతఁ డన్నియునుఁ జేసినవాఁడె
తెలిసి సూర్యునిఁ జూడ దీపాలు వలెనా
    
చ. 3: వేదవేద్యుఁడు శ్రీవేంకటపతినామ-
మాదిగాఁ బఠియించే యధికునికి
ఆదైన చదువులు అఱచేతి వతనికి
మేదినిఁ దిరుగాడ మెట్లు వలెనా