పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0112-01 శ్రీరాగం సం: 02-067 అద్వైతము

పల్లవి: ఏఁటిమాట లివి విన నింపయ్యీనా మది-
నేఁటవెట్టి దాసుఁడౌ టిదిసరియా
    
చ. 1: జీవుఁడే దేవుఁడని చెప్పుదురు గొందరు
దైవముచేఁతలెల్లాఁ దమ కున్నవా
ఆవలఁ గొందరు కర్మ మది బ్రహ్మ మందురు
రావణాదు లవి సేసి రతికెక్కిరా
    
చ. 2: మిగులఁ గొందర దైవమే లేదనెందురు
తగ నీప్రపంచమెల్లాఁ దనచేఁతలా
గగన మతఁడు నిరాకార మందురు గొంద-
రెగువఁ బురుషసూక్త మెఱఁగరా తాము
    
చ. 3: యెనిమిది గుణములే యితని వందురు గొంద-
రనయము మిగిలిన వవి దమవా
యెనయఁగ శ్రీవేంకటేశ్వరుదాసులై
మనుట నిత్యముగాక మరి యేమినేలా