పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0110-04 శ్రీరాగం సం: 02-058 వైరాగ్య చింత

పల్లవి: వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు
భవసంపదల పెద్దపౌఁజు చూచీ జీవుఁడు
    
చ. 1: చిత్తమనియెడి మహాసింహాసనం బెక్కి
హత్తి బహుపరాకాయ నదె జీవుఁడు
గుత్తపు దేహమనేటి కొలువుకూటములోన
జొత్తుఁ బ్రకృతినాట్యము చూచీని జీవుఁడు
    
చ. 2: పంచేంద్రియములనే బలుతేజీలపై నెక్కి
అంచల వయ్యాళి దోలీనదె జీవుఁడు
ముంచిన కర్మములనే ముద్రల పెట్టెలు దెచ్చి
సంచముగా లెక్కవెట్టి సరిదాఁచీ జీవుఁడు
    
చ. 3: యిచ్చఁ గామక్రోధాలనే హితమంత్రులునుఁ దారు
తచ్చి తలపోసుకొనీఁ దగ జీవుఁడు
అచ్చపు శ్రీవేంకటేశుఁ డంతరాత్మయై యుండఁగా
పచ్చిగా నాతనిఁ జూచి భ్రమసీని జీవుఁడు