పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0110-03 గౌళ సం: 02-057 దశావతారములు

పల్లవి: ఈతనిఁ గొలిచితేనే యిన్ని గొలలునుఁ దీరు
చేతనఁ బెట్టు పుణ్యాలు చేరువనే కలుగు
    
చ. 1: పట్టి కాళింగునిఁ దోలి పాముకొల దీర్చినాఁడు
బట్టబాయిటనే రేపల్లెవారికి
అట్టె పూతనఁ జంపి ఆఁడుఁగొల దీర్చినాఁడు
గట్టిగాఁ గృష్ణుఁడు లోకమువారికెల్లను
    
చ. 2: బలురావణుఁ జంపి బాఁపనకొల దీర్చినాఁడు
యిలమీఁదఁ గలిగిన ఋషులకెల్లా
కొలఁది మీరినయట్టి కోఁతికొల దీర్చినాడు
సొలసి రాఘవుఁ డదె సుగ్రీవునికిని
    
చ. 3: వొలిసి పురాలు చొచ్చి వూరఁగొల దీర్చినాఁడు
అల తనదాసులైన అమరులకు
సిలుగుఁగొలలు దీర్చి సేన వరా లిచ్చినాఁడు
చెలఁగి పరుషలకు శ్రీవేంకటేశుఁడు