పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0110-02 గుండక్రియ సం: 02-056 అధ్యాత్మ

పల్లవి: హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని
తరఁగు మొరఁగులను దాఁటలే రెవ్వరును
    
చ. 1: నిండుఁ జింతాజలధికి నీళ్లు దనచిత్తమే
దండి పుణ్యపాపాలే దరులు
కొండలవంటి కరళ్లు కోరికె లెందు చూచినా
తండుముండుపడేవారే దాఁటలే రెవ్వరును
    
చ. 2: ఆపదలు సంపదలు అందులోని మకరాలు
కాఁపురపు లంపటాలే కైయొత్తులు
చాపలపు గుణములే సరిఁజొచ్చే యేరులు
దాపుదండ చేకొని దాఁటలే రెవ్వరును
    
చ. 3: నెలవై వుబ్బుసగ్గులే నిచ్చలుఁబోటునుఁ బాటు
బలువైన యాశే బడబాగ్ని
యెలమి శ్రీవేంకటేశుహితులకే కాల్నడ
తలఁచి యితరులెల్ల దాఁటలే రెవ్వరును