పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0110-05 సామంతం సం: 02-059 అధ్యాత్మ

పల్లవి: చెల్లఁబో తియ్యనినోరఁ జేఁదేఁటికి యీ-
పల్లదపుఁ గోరికలపాలు సేయవలెనా
    
చ. 1: ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట
దాసునిఁగా నాపాలిదైవమా నీవు
పోసరించి భూమిలోనఁ బుట్టించి రక్షించి
యీసులేక భంగపెట్టు టిది గొంత వలెనా
    
చ. 2: పామరపు టింద్రియాలబారిఁ దోసితివి నన్ను
దామెనకట్టుగాఁ గట్టి తత్త్వమా నీవు
దోమటి నామతిలోనఁ దోడునీడవై యుండి
పామేటి సుఖములనే భ్రమయించవలెనా
    
చ. 3: గక్కన నింతట నన్నుఁ గరుణించితివి నేఁడు
మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు
దిక్కుదెసవై నాకు దేవుఁడవై యేలికవు
చొక్కి నామనసింత సోదించవలెనా