పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0108-05 సాళంగనాట సం: 02-047 దశావతారములు

పల్లవి: నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు
చాయల నీసుద్ది విని శరణంటి నేను
    
చ. 1: కావలనంటేఁ దొల్లి కంభము చించుకవెళ్లి
కైవశమై ప్రహ్లాదుఁ గావవా నీవు
తేవలనంటే బ్రహ్మదేవునికి వేదములు
సోవల సముద్రమయిన చొచ్చి తేవా నీవు
    
చ. 2: పట్టియెత్తవలెనంటేఁ బాతాళానఁ బడ్డ కొండ
తట్టియెత్తి పాలవెల్లి దచ్చవా నీవు
మట్టుపెట్టవలెనంటే మరి భూమి చాపగాఁగ
చుట్టుకపోతేఁ దెచ్చి సొంపుగ నిలుపవా
    
చ. 3: పక్షపాతమయ్యేనంటేఁ బాండవుల గెలుపించి
యీక్షితి యేలించి చనవియ్యవా నీవు
రక్షించేనంటేఁ గాతరాన శ్రీవేంకటాద్రిఁ బ్ర-
త్యక్షమై మావంటివారిఁ దగఁ గరుణించవా