పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0108-06 సామంతం సం: 02-048 కృస్ణ

పల్లవి: అందరివలెనే వున్నాఁ డాతడాఁ వీఁడు
యిందుముఖులఁ గూడినాఁ డీతఁడానాఁడు
    
చ. 1: యిందరూ నేఁటేఁట జేసే యింద్రయాగపు ముద్దలు
అందుకొని యారగించినాతఁడా వీఁడు
చెంది మునులసతుల సతఁ దెప్పించుక మంచి-
విందు లారగించినాఁడు వీఁ డానాఁడు
    
చ. 2: తొలుత బ్రహ్మ దాఁచిన దూడలకు బాలులకు
అలరి మారు గడించినాతఁడా వీఁడు
నిలుచుం డేడుదినాలు నెమ్మది వేలఁ గొండెత్తి
యిల నావులఁ గాచినాఁ డీతఁ డానాఁడు
    
చ. 3: బాలుఁడై పూతనాదుల బలురక్కసులఁ జంపి
ఆలరి యాటలాడిన యాతఁడా వీఁడు
యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాఁడు తొలుతే
యేలెను బ్రహ్మాదుల నీతఁ డానాఁడు