పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0108-04 రామక్రియ సం: 02-046 వైరాగ్య చింత

పల్లవి: తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను
యిల నొకమాట నీ కెత్తిచ్చితిఁగాని
    
చ. 1: పుట్టించేవాఁడవు నీవే బుద్ధిచ్చేవాఁడవు నీవే
యెట్టున్నా నపరాధా లేవి మాకు
అట్టూ నన్నవారముగా మనఁగా నీచిత్తమెట్టో
కిట్టి వొకమాట మడిగితి నింతేకాని
    
చ. 2: మనసులోపల నీవే మరి వెలుపల నీవే
యెనసి అపరాధాలు యేవి మాకు
నిను నౌఁగాదనలేము నీ సరివారముఁ గాము
అనవలసినమాట అంటి మింతే కాని
    
చ. 3: అంతరాత్మవును నీవే అన్నిటాఁ గావఁగ నీవే
యెంతైనా నపరాధా లేవి మాకు
వింత లేక శ్రీవేంకటవిభుఁడ నీబంట నింతే
వంతుకు నేనొకమాట వాకుచ్చితిఁగాని