పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0108-01 లలిత సం: 02-043 భక్తి

పల్లవి: ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానే గురుతు
    
చ. 1: పరమమంగళము భగవన్నామము
సురులకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిఁగిన యెదుటనె వున్నది
వరుసల మఱచినవారికి మాయ
    
చ. 2: వేదాంతసారము విష్ణుభక్తి యిది
ఆదిమునుల మత మయినది
సాదించువారికి సర్వసాధనము
కాదని తొలఁగిన గడుశూన్యంబు
    
చ. 3: చేతినిధానము శ్రీవేంకటపతి
యేతలఁ జూచిన నిందరికి
నీతియు నిదియే నిజసేవకులకు
పాతకులకు నది భవసాగరము